Mutton Paya : మాంసాహార ప్రియులకు మటన్ పాయా రుచి ఎలా ఉంటుందో తెలుసు. మటన్ పాయాకు ఉండే రుచి అంతా ఇంతా కాదు. మటన్ పాయాను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పాయాను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. పాయా.. కండ పుష్టిని పెంచడంతోపాటు కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం నుండి వ్యర్థాలను తొలగించడంలో, బరువు తగ్గడంలో కూడా పాయా ఉపయోగపడుతుంది. ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులను తగ్గించడంలో మటన్ పాయా ఎంతో సహాయపడుతుంది. మటన్ పాయాను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో సూక్ష్మ పోషకాల స్థాయిలు పెరుగుతాయి. మటన్ పాయాను రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. చిక్కగా, ఎంతో రుచిగా ఉండేలా మటన్ పాయాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ పాయా తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ పాయా (కాళ్లు) – 300 గ్రా., నూనె – అర కప్పు, మిరియాలు – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒకటి (ఇంచు పరిమాణంలో ఉన్నది), యాలకులు – 4. లవంగాలు – 5, బిర్యానీ ఆకు – ఒకటి, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉల్లిపాయలు – పావు కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, పసుపు – పావు టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, తరిగిన పచ్చి మిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మ రసం – అర టేబుల్ స్పూన్.
మటన్ పాయా తయారు చేసే విధానం..
ముందుగా మటన్ పాయాను 4 నుండి 5 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత జార్ లో ఉల్లిపాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లో నూనె వేసి కాగాక దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ను వేసి, మధ్యస్థ మంటపై ఉల్లిపాయ పేస్ట్ లోని నీరు అంతా పోయి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత పాయా, పచ్చి మిర్చి, నిమ్మరసం, కొత్తిమీర, నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ పాయాను వేసి బాగా కలుపుకోవాలి. తరువాత 200 ఎంఎల్ నీళ్లను పోసి మధ్యస్థ మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.
ఇలా ఉడికించుకున్న తరువాత అర లీటర్ నీళ్లను పోసి కలిపి, మూత పెట్టి, చిన్న మంటపై నాలుగు విజిల్స్, మధ్యస్థ మంటపై రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో పావు లీటర్ నీళ్లను పోసి మధ్యస్థ మంటపై 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత తరిగిన పచ్చి మిర్చి, తరిగిన కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చిక్కగా, ఎంతో రుచిగా ఉండే మటన్ పాయా తయారవుతుంది. మటన్ పాయా వేడిగా ఉన్నప్పుడు పలుచగా.. చల్లారిన తరువాత చిక్కగా అవుతుంది. ఇందులో ఉపయోగించిన ఉల్లిపాయ పేస్ట్ ను ఎర్రగా వేయించుకోవడం వల్ల పాయాకు మంచి రంగు, రుచి వస్తుంది. మటన్ పాయాను ఎంత నెమ్మదిగా ఉడికించుకుంటే అంత రుచిగా ఉంటుంది. మటన్ పాయాను అన్నం, రోటి, పుల్కా, దోశ, అట్టు వంటి వాటితో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి.