మీకు మీ చిన్నతనం గుర్తుందా? గుర్తుండకేం ఆ వయస్సులో బాగానే అల్లరి చేశాం, అంత సులభంగా దాన్ని ఎలా మరిచిపోతాం, అంటారా. అయితే మీరు చెబుతోంది కరెక్టే కానీ, టాపిక్ అది కాదు. అసలు విషయం ఏమిటంటే మీరు మీ చిన్నతనంలో బబుల్‌గమ్స్, చూయింగ్ గమ్స్ ఎక్కువగా తినేవారా? అయితే అవి తినేటప్పుడు అకస్మాత్తుగా, అనుకోకుండా ఆ గమ్స్ లోపలికి వెళ్తే ఎలా? అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోకేం, చూయింగ్ గమ్స్ తినేటప్పుడు బాగానే భయ పడిపోయేవారం. ఎక్కడి అవి లోపలికి వెళ్లి పొట్టలో అతుక్కుంటాయో, దాని వల్ల ఎలాంటి ప్రమాదం వస్తుందోనని తెగ భయపడిపోయే వారం అంటున్నారా, అయితే మీరు ఆ సమయంలో భయపడింది కరెక్టే కానీ, చూయింగ్ గమ్స్ పొరపాటున లోపలికి వెళ్లినా మన ఆరోగ్యానికి వచ్చే ప్రమాదం ఏమీ లేదట. అవును, మీరు విన్నది నిజమే.
సాధారణంగా చూయింగ్ గమ్‌లలో వివిధ రకాల ఫ్లేవర్లు కలిగిన పదార్థాలు, చక్కెర వంటి వస్తువులతోపాటు సాగే గుణం వచ్చేలా గమ్‌ను పోలిన కొన్ని పదార్థాలను కూడా కలుపుతారు. అందువల్ల మనం నోట్లో చూయింగ్ గమ్ వేసుకోగానే తిండికి సంబంధించిన పదార్థం అయిపోతూ క్రమంగా గమ్ బయటికి వస్తూ అది సాగుతూ ఉంటుంది. దీంతో కొంత మంది నోటి ద్వారా బెలూన్లు కూడా చేస్తుంటారు. అయితే ఆ గమ్ ఒక వేళ పొరపాటున లోపలికి పోయినా అది మన జీర్ణాశయానికి మాత్రం అంటుకోదట. దాన్ని జీర్ణం చేయగలిగే పవర్‌ఫుల్ యాసిడ్లు మన కడుపులో ఉంటాయట. చూయింగ్ గమ్‌లో మిగిలిపోయిన చక్కెర, ఇతర ఆహార పదార్థాలు జీర్ణం కాగా మిగిలిందంతా వ్యర్థ పదార్థం కింద బయటకి వెళ్లిపోతుందట. కాబట్టి చూయింగ్ గమ్‌ను మింగినా మనకు కలిగే నష్టం ఏమీ ఉండదట.
అయితే క్రాన్స్ డిసీజ్ వంటి వ్యాధులు ఉన్నవారు మాత్రం చూయింగ్ గమ్‌లను మితంగానే తినాలట. లేదంటే వారికి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయట. ఇలాంటి వారు గమ్‌లను మింగితే మలబద్దకం వంటి సమస్యలు తలెత్తుతాయట. ఇతరులెవరైనా నిర్భయంగా చూయింగ్ గమ్‌ను నమలవచ్చట. దీంతో ఉమ్మినీటి గ్రంథులు యాక్టివేట్ అయి నోటి దుర్వాసనను పోగొడుతాయి. నోట్లో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. గ్యాస్ కారణంగా గుండెల్లో వచ్చే మంట కూడా తగ్గుతుంది. అయితే ఎవరైనా చూయింగ్ గమ్‌లను పరిమితంగానే తినాలట. ఎక్కువ తింటే వాటితో అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందట. కాబట్టి, చూయింగ్ గమ్‌ను తినండి, కానీ తక్కువగా తినండి, దాంతో కలిగే బెనిఫిట్స్ పొందండి. పొరపాటున గమ్‌ను మింగినా ఏమీ కాదని తెలుసుకోండి.