Carrots : క్యారెట్లను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. క్యారెట్లను పచ్చిగా కూడా తినవచ్చు. వీటిన కూరల్లోనూ వేస్తుంటారు. అనేక రకాల వంటల్లో క్యారెట్లను వేసి వండుతుంటారు. అయితే క్యారెట్లను కొందరు వండడం కన్నా పచ్చిగానే తినేందుకు ఇష్టపడతారు. ఇంకొందరు జ్యూస్‌లా చేసుకుని తాగుతుంటారు. అయితే క్యారెట్లను ఎలా తిన్నా సరే ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. ఇక క్యారెట్లలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది.
ఒక మీడియం సైజ్ క్యారెట్‌లో సుమారుగా 4 మిల్లీగ్రాముల బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది ఆరెంజ్-యెల్లో ఫ్యాట్ సాల్యుబుల్ సమ్మేళనం. అంటే కొవ్వులో కరుగుతుందన్నమాట. ఇక ఇదొక సహజసిద్ధమైన పిగ్మెంట్. దీని వల్లే క్యారెట్లు ఆరెంజ్-యెల్లో కలర్‌లో ఉంటాయి.
అయితే మనం తినే క్యారెట్‌ల వల్ల లభించే బీటా కెరోటిన్ మన శరీరంలోకి ప్రవేశించగానే అది కొన్ని ఎంజైమ్ ల సహాయంతో విటమిన్ ఎ గా మారుతుంది. ఇది మన శరీరానికి అవసరం అయిన విటమిన్లలో ఒకటి. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్ల సమస్యలను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
అయితే క్యారెట్లను అధికంగా తింటే మన శరీరంలో బీటా కెరోటిన్ అధికంగా చేరుతుంది. ఈ క్రమంలో శరీరం తనకు అవసరం అయినంత మేర బీటా కెరోటిన్‌ను గ్రహించి దాన్ని విటమిన్ ఎ గా మార్చుకుంటుంది. ఇక అంతకన్నా అధికంగా ఉన్న బీటాకెరోటిన్ రక్తంలో కలుస్తుంది. ఇది రక్తంలో అధికంగా చేరితే చర్మం రంగు కూడా మారుతుంది. దీంతో మన చర్మం పసుపు రంగులో కనిపిస్తుంది. ఈ స్థితినే కెరోటినేమియా అంటారు. అయితే క్యారెట్లను అధికంగా తింటే చర్మం పసుపు లేదా నారింజ రంగులోకి మారే మాట వాస్తవమే అయినా.. క్యారెట్లను మోతాదుకు మించి తినరాదు. తింటే దుష్ప్రభావాలు కలుగుతాయి. కనుక వేటిని అయినా సరే పరిమిత మోతాదులో తింటేనే ప్రయోజనాలను పొందవచ్చు. అధిక మోతాదులో తింటే అనర్థాలు సంభవిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.