Nimmakaya Pulihora : మనం తరచూ నిమ్మకాయ రసాన్ని ఉపయోగించి నిమ్మకాయ పులిహోరను తయారు చేస్తూ ఉంటాం. నిమ్మకాయ పులిహోర రుచి ఏవిధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. మనం నిమ్మ కాయ పులిహోర తయారీలో పచ్చిమిర్చిని వాడుతూ ఉంటాం. ఈ పచ్చి మిర్చిని ఉపయోగించి తరచూ చేసే విధంగా కాకుండా కొత్తగా నిమ్మకాయ పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి కారం నిమ్మకాయ పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – అర కిలో బియ్యంతో వండినంత, నిమ్మ రసం – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, పచ్చి మిర్చి – 5, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టేబుల్ స్సూన్స్, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినప పప్పు – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిరపకాయలు – 8, కరివేపాకు – రెండు రెబ్బలు, పసుపు – ఒక టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత.
పచ్చి కారం నిమ్మకాయ పులిహోర తయారీ విధానం..
ముందుగా వెడల్పుగా ఉండే ఒక గిన్నెలో అన్నాన్ని వేసి చల్లగా చేసుకోవాలి. అన్నం చల్లగా అయిన తరువాత నిమ్మ రసాన్ని వేసి కలిపి 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. తరువాత ఒక జార్ లో పచ్చి మిర్చి, ఎండు కొబ్బరి ముక్కలు వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగిన తరువాత పల్లీలను వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో మిగిలిన తాళింపు పదార్థాలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి మిర్చి మిశ్రమాన్ని వేసి కలిపి 3 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తాళింపును ముందుగా నిమ్మ రసం కలిపి పెట్టుకున్న అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. తరువాత వేయించిన పల్లీలను వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చి కారం నిమ్మ కాయ పులిహోర తయారవుతుంది. తరచూ చేసుకునే నిమ్మకాయ పులిహోర కంటే కూడా ఇలా చేసుకున్న పులిహోర ఎంతో రుచిగా ఉంటుంది.