Pulagam Annam : మనం కొన్ని పండుగలకు, ప్రత్యేక సందర్బాలలో బియ్యంతో పెసర పప్పును కలిపి వండుతూ ఉంటాం. దీనిని పులగం అంటారని మనందరికీతెలుసు. కొందరు దీనిని పులగం అన్నం అని కూడా అంటారు. పులగం అన్నాన్ని తరచూ తయారు చేసుకునే వారు కూడా ఉంటారు. అయితే దీన్ని కేవలం పండుగల సమయంలోనే కాదు.. తరచూ తినవచ్చు. పెసరపప్పు వాడుతారు కనుక ఇది మనకు పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే కొందరికి ఎన్ని సార్లు ప్రయత్నించినప్పటికీ పులగం అన్నం పొడి పొడిగా కాకుండా మెత్తగా పొంగల్ లా తయారవుతుంది. కానీ పులగం అన్నాన్ని చాలా సులువుగా పొడిగా ఉండేలా కూడా వండుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పులగం అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – రెండు కప్పులు, పెసర పప్పు – ఒకటిన్నర కప్పు, పసుపు – చిటికెడు, ఉప్పు – కొద్దిగా, కచ్చా పచ్చాగా చేసిన మిరియాలు – ఒక టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, నూనె – ఒక టేబుల్ స్పూన్.
పులగం అన్నం తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో బియ్యం, పెసర పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి చల్లగా అయిన తరువాత శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి అర గంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నూనె వేసి నూనె కాగాక మిరియాల పొడి వేసి కొద్దిగా వేయించాలి. తరువాత ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ల చొప్పున ఏడు కప్పుల నీళ్లు, నీళ్లతోపాటు ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. నీళ్లు మరిగిన తరువాత నానబెట్టుకున్న బియ్యం, పెసర పప్పును వేసి ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడి పొడిగా, రుచిగా ఉండే పులగం అన్నం తయారవుతుంది. దీనిని తాళింపు వేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఎటువంటి కూరతో అయినా పులగం అన్నాన్ని తినవచ్చు. ముఖ్యంగా వంకాయ కూరతో పులగం అన్నాన్ని కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వేసవి కాలంలో పులగం అన్నాన్ని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.