Pachi Kobbari Pachadi : ఉదయం చేసుకునే అల్పాహారాలను తినడానికి మనం రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. ఇలా తయారు చేసే వాటిల్లో పచ్చి కొబ్బరి పచ్చడి కూడా ఒకటి. పచ్చి కొబ్బరిని తీపి పదార్థాల తయారీలో కూడా వాడుతూ ఉంటాం. పచ్చి కొబ్బరిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. థైరాయిడ్ గ్రంథి పని తీరును మెరుగుపరచడంలో పచ్చి కొబ్బరి ఎంతగానో సహాయపడుతుంది.
తరచూ పచ్చి కొబ్బరిని ఆహారంగా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నీరసాన్ని తగ్గించి శరీరానికి కావల్సిన శక్తిని అందించడంలో పచ్చి కొబ్బరి ఉపయోగపడుతుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. పచ్చి కొబ్బరి పచ్చడిని చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలో, ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి కొబ్బరి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి – ఒక కొబ్బరి కాయలో ఉండేంత, పచ్చి మిరపకాయలు – 10 లేదా 12, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు -5, చింతపండు గుజ్జు – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – ఒకటి, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, పసుపు – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – రుచికి తగినంత, నీళ్లు – పచ్చడికి సరిపడా.
పచ్చి కొబ్బరి పచ్చడి తయారీ విధానం..
ముందుగా పచ్చికొబ్బరిని ముక్కలుగా చేసుకోవాలి. ఒక జార్ లో పచ్చి కొబ్బరిని, పచ్చి మిరపకాయలను, ఉప్పును వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టిన తరువాత మూత తీసి చితపండు గుజ్జు, తగినన్ని నీళ్లను పోసి మెత్తగా అయ్యేలా మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత కొత్తిమీర తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని, కొద్దిగా నీళ్లను పోసి కలిపి పచ్చ వాసన పోయేలా బాగా వేయించుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా ఉండే పచ్చి కొబ్బరి పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతోపాటు లేదా ఉదయం చేసే అల్పాహారాలన్నింటితోనూ కలిపి తినవచ్చు. పచ్చి కొబ్బరిని నేరుగా తినలేని వారు ఇలా పచ్చడిగా చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతోపాటు పచ్చి కొబ్బరిలోని పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.