Bombay Chutney : మనం ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా అప్పుడప్పుడూ పూరీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పూరీలతో కలిపి తినడానికి మనం రకరకాల కూరలను, చట్నీలను తయారు చేస్తూ ఉంటాం. పూరీలను తినడానికి చక్కగా సరిపోయే వాటిల్లో బొంబాయి చట్నీ కూడా ఒకటి. ఈ చట్నీని బొంబాయి సాంబార్, పూరీ కూర అని కూడా ఉంటారు. ఈ చట్నీతో కలిపి తింటే పూరీలు చాలా రుచిగా ఉంటాయి. బొంబాయి చట్నీని చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలో, ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు. బొంబాయి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
బొంబాయి చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగ పిండి – 3 టేబుల్ స్పూన్స్, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1 (పెద్దది), చిన్నగా తరిగిన టమాట -1, తరిగిన పచ్చి మిర్చి – 5 , కరివేపాకు – ఒక రెబ్బ, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, మినప పప్పు – అర టీ స్పూన్, శనగపప్పు – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – తగినన్ని.
బొంబాయి చట్నీ తయారీ విధానం..
ముందుగా ఒకగిన్నెలో శనగ పిండిని, నీళ్లను పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర, ఆవాలు, శనగ పప్పు, మినప పప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత పచ్చి మిర్చి, కరివేపాకు, పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి కలిపి వేయించుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా వేగిన తరువాత టమాట ముక్కలను వేసి టమాట ముక్కలు పూర్తిగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా శనగ పిండి వేసి కలిపిన నీటిని పోసి కలిపి శనగపిండి పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బొంబాయి చట్నీ తయారవుతుంది. ఈ చట్నీ వేడిగా ఉన్నప్పుడు పలుచగా ఉన్నా చల్లారే కొద్దీ చిక్కగా అవుతుంది. కనుక రుచికి తగినట్టుగా దీనిని ఉడికించుకోవాలి. బొంబాయి చట్నీని పూరి, దోశ, చపాతీ వటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.