Diabetes : తంగేడు చెట్టు.. ఇది మనందరికీ తెలిసిందే. తంగేడు పువ్వులతో బతుకమ్మలను తయారు చేసి దేవతగా పూజిస్తుంటారు. మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఈ చెట్టు ఎంతో ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు. ఈ చెట్టు పువ్వులు లభించే సమయంలో వాటిని సేకరించి నీడకు ఎండబెట్టి నిల్వ చేసి సంవత్సరమంతా వాడుకోవచ్చు. ఈ చెట్టు పువ్వులను ఉపయోగించడం వల్ల ఏయే రోగాలు నయం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తంగేడు పువ్వులు షుగర్ వ్యాధికి దివ్య ఔషధంగా పని చేస్తాయి. తంగేడు పువ్వులను ఏవిధంగానైనా వాడవచ్చు. గుప్పెడు తంగేడు పువ్వులను తీసుకుని మినప పప్పుతో లేదా పెసర పప్పుతో కూర చేసుకుని తినవచ్చు. ఇలా చేయడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. పురుషుల్లో వచ్చే స్వప్న స్కలనాలను నివారించడంలో తంగేడు పువ్వులు ఎంతగానో సహాయపడతాయి. నిద్రలో స్కలన సమస్యతో బాధపడే మగవారికి తంగేడు పువ్వులు చక్కటి ఔషధమని నిపుణులు చెబుతున్నారు. తంగేడు పువ్వు రెక్కలను, చక్కెరను ఆవు పాలలో వేసి బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ చొప్పున రోజూ తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.
శరీరానికి బలాన్ని చేకూర్చడంలోనూ తంగేడు పువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి. అరికాళ్లలో మంటలను, నీరసాన్ని, గుండె దడను తగ్గించడంలోనూ ఈ చెట్టు పువ్వులు దోహదపడతాయి. తంగేడు పువ్వుల రెక్కలు 100 గ్రా., ధనియాల పొడి 50 గ్రా., యాలకుల పొడి 20గ్రా., శొంఠి పొడి 20 గ్రా. చొప్పున కలిపి నిల్వ చేసుకోవాలి. రాగి పిండితో జావను చేసి అందులో పాలను, పంచదారను వేసి ముందుగా నిల్వ చేసుకున్న మిశ్రమాన్ని ఒక టీ స్పూన్ చొప్పున వేసి కలిపి తాగడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు. అరికాళ్లలో మంటలు, గుండె దడ, నీరసం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
చారు, రసం, సాంబార్ వంటి వాటిని తయారు చేసేటప్పుడు ఈ పూల రెక్కలను లేదా పొడిని వేసి మరిగించి ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. అతి మూత్ర వ్యాధిని నివారించడంలో తంగేడు పువ్వులు ఎంతగానో ఉపయోపడతాయి. తంగేడు పువ్వుల రెక్కలను నీడలో ఎండబెట్టి పొడిలా చేసుకోవాలి. ఈ పొడికి చక్కెరను లేదా తేనెను కలిపి ప్రతిరోజూ అర టీ స్పూన్ చొప్పున తీసుకోవడం వల్ల అతి మూత్ర వ్యాధి నయం అవుతుంది.
శరీరానికి చలువ చేసే గుణం కూడా తంగేడు పువ్వులకు ఉంటుంది. తంగేడు పువ్వులను ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండడం వల్ల బలంగా తయారవుతారు. చర్మం కూడా కాంతివంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.