Mudda Pappu : మనం వంటింట్లో కందిపప్పును ఉపయోగించి పప్పు కూరలను తయారు చేస్తూ ఉంటాం. కందిపప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పప్పులో ప్రోటీన్స్, కార్బొహైడ్రేట్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. పిల్లల ఎదుగుదలకు ఈ పప్పు ఎంతగానో సహాయపడుతుంది. ఈ పప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సినంత ఐరన్, కాల్షియం లభిస్తాయి. ఫోలిక్ యాసిడ్ అధికంగా కలిగిన ఆహారాల్లో కందిపప్పు కూడా ఒకటి. గర్భిణీ స్త్రీలు దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల కడుపులో పిండం ఎదుగల బాగుంటుంది. కందిపప్పుతో పప్పు కూరలనే కాకుండా కందిపప్పును ఉడికించి ముద్దపప్పును కూడా తయారు చేస్తూ ఉంటారు. కేవలం కందిపప్పును ఉడికించి తినడం వల్ల కడుపులో గ్యాస్ తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కడుపులో గ్యాస్ తయారవకుండా, రుచిగా ముద్దపప్పును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముద్ద పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 6 లేదా 7, ఉప్పు – తగినంత, నూనె – ఒక టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, నీళ్లు – తగినన్ని.
ముద్దపప్పు తయారీ విధానం..
ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లను పోసి అర గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లో నానబెట్టుకున్న కందిపప్పును, రుచికి తగినంత ఉప్పును, వెల్లుల్లి రెబ్బలను, పసుపును, నూనెను వేసి తగినన్ని నీళ్లను పోసి మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తరువాత మూత తీసి పప్పును గంటెతో కానీ పప్పుగుత్తితో కానీ మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు పప్పును ఒక గిన్నెలోకి తీసుకుని పప్పు పైన నెయ్యిని వేయాలి. ఇలా చేయడం వల్ల ముద్దపప్పు తయారవుతుంది. ముద్ద పప్పులో వెల్లుల్లి రెబ్బలను వేయడం వల్ల కడుపులో గ్యాస్ తయారవకుండా ఉంటుంది. అన్నంతో కలిపి పిల్లలకు ఆహారంగా ఇవ్వడం వల్ల పిల్లలు బలంగా తయారవుతారు. వేడి వేడి అన్నంలో ముద్దపప్పును, ఆవకాయను, నెయ్యిని వేసి కలిపి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. ఇలా చేసుకున్న ముద్ద పప్పుతో మనం పప్పుచారును కూడా తయారు చేసుకోవచ్చు.