Putnala Pappu Laddu : శనగలను వేయించి పుట్నాల పప్పును తయారు చేస్తారని మనందరికీ తెలుసు. వంటింట్లో పుట్నాల పప్పును కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. పుట్నాల పప్పుతో చేసే చట్నీ, కారం పొడి చాలా రుచిగా ఉంటాయని మనందరికీ తెలుసు. పుట్నాల పప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో, మలబద్దకాన్ని నివారించడంలో పుట్నాల పప్పు ఎంతో ఉపయోగపడుతుంది.
చర్మం, జుట్టు సంబంధమైన సమస్యలను తగ్గించడంలోనూ పుట్నాల పప్పు ఉపయోగపడుతుంది. పుట్నాల పప్పుతో మనం లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. పుట్నాల పప్పుతో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్నాల పప్పు లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
పుట్నాల పప్పు – 2 కప్పులు, బెల్లం తురుము – ఒక కప్పు, జీడి పప్పు – 15, బాదం పప్పు – 15, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నెయ్యి – 100 గ్రా..
పుట్నాల పప్పు లడ్డూలను తయారు చేసే విధానం..
ముందుగా కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి నెయ్యి కరిగిన తరువాత బాదం పప్పు, జీడి పప్పును వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లగా అయ్యే వరకు పక్కన ఉంచాలి. అదే కళాయిలో మరో టీ స్పూన్ నెయ్యిని, పుట్నాల పప్పును కూడా వేసి పుట్నాల పప్పు రంగు మారే వరకు వేయించి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు ఒక జార్ లో ముందుగా వేయించి ఉంచిన పుట్నాలను వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్ లో వేయించిన జీడిపపప్పును, బాదం పప్పును వేసి కచ్చా పచ్చా ఉండేలా మిక్సీ పట్టి పుట్నాల పప్పు మిశ్రమంలో వేసి కలిపిన తరువాత బెల్లం తురుమును వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుతూ కావల్సిన పరిమాణంలో లడ్డూలలా తయారు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పుట్నాల పప్పు లడ్డూలు తయారవుతాయి. ఈ లడ్డూల తయారీలో నెయ్యికి బదులుగా కాచి చల్లార్చిన పాలను కూడా ఉపయోగించవచ్చు. మూత ఉండే డబ్బాలో నిల్వ చేసుకోవడం వల్ల ఈ లడ్డూలు 10 నుండి 15 రోజుల వరకు తాజాగా ఉంటాయి. మధ్యాహ్నం భోజనం తరువాత ఒకటి లేదా రెండు చొప్పున ఈ లడ్డూలను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు, శక్తి లభిస్తాయి. దీంతోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు.