Tomato Pallilu Roti Pachadi : మనం టమాటాలను ఉపయోగించి పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలతో చేసే పచ్చళ్లల్లో టమాట పల్లి పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి ఈ పచ్చడిని తింటే చాలా రుచిగా ఉంటుంది. టమాట పల్లి పచ్చడిని రోట్లో వేసి చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. చాలా సలువుగా, చాలా రుచిగా టమాట పల్లి పచ్చడిని రోట్లో వేసి ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట పల్లీల రోటి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్దగా తరిగిన టమాటాలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), వేయించి పొట్టు తీసిన పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, పచ్చి మిరప కాయలు – 10, పెద్దగా తరిగిన ఉల్లిపాయ – ఒకటి, వెల్లుల్లి రెబ్బలు – 5, చింతపండు – కొద్దిగా, పసుపు – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – రెండు రెబ్బలు, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
టమాట పల్లీల రోటి పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి కాగిన తరువాత తరిగిన ఉల్లిపాయలను, పచ్చి మిర్చిని, వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత తరిగిన టమాట ముక్కలను, పసుపును, చింతపండును వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి టమాట ముక్కలు పూర్తిగా వేగే వరకు ఉంచాలి. టమాట ముక్కలు వేగిన తరువాత కరివేపాకును వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి.
ఇప్పడు రోట్లో పల్లీలను వేసి మెత్తగా పొడిగా అయ్యేలా దంచుకోవాలి. ఇలా దంచిన తరువాత చల్లార బెట్టుకున్న టమాట ముక్కల మిశ్రమాన్ని, తగినంత ఉప్పును వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చగా ఉండేలా నూరి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఒక టీ స్పూన్ నూనెను వేసి నూనె కాగిన తరువాత మిగిలిన పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట పల్లీల రోటి పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని జార్ లో కూడా వేసుకుని తయారు చేసుకోవచ్చు. అన్నంతోపాటు దోశ, ఇడ్లీ, పెసరట్టు వంటి వాటితో కలిపి ఈ పచ్చడిని తింటే చాలా రుచిగా ఉంటుంది.