Ghee Rice : మనం ఆహారంలో భాగంగా పాల నుండి తయారయ్యే నెయ్యిని కూడా తీసుకుంటూ ఉంటాం. నెయ్యిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మనలో చాలా మంది ప్రతి రోజూ నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. నెయ్యిని తీపి పదార్థాల తయారీలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. నెయ్యిని వేసి చేసే తీపి పదార్థాలు ఎంతో రుచిగా ఉంటాయి. నెయ్యితో కేవలం తీపి పదార్థాలనే కాకుండా ఎంతో రుచిగా ఉండే అన్నాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. నెయ్యి అన్నం ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభమే. నెయ్యితో అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి .. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యి అన్నం తయారీకి కావల్సి పదార్థాలు..
నానబెట్టిన బాస్మతి బియ్యం – ఒక గ్లాస్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు – 6, బిర్యానీ ఆకు – 1, యాలకులు – 2, లవంగాలు – 3, దాల్చిన చెక్క ముక్కలు – 2, అనాస పువ్వు – 1, సాజీరా – అర టీ స్పూన్, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 2, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నీళ్లు – 2 గ్లాసులు, ఉప్పు – తగినంత, సన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
నెయ్యి అన్నం తయారీ విధానం..
ముందుగా అడుగు భాగంలో మందంగా ఉన్న కళాయిలో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తరువాత జీడి పప్పును వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో వెల్లుల్లి రెబ్బలను, మసాలా దినుసులను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పచ్చిమిర్చిని, ఉల్లిపాయలను వేసి ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తరువాత నీళ్లను, ఉప్పును వేసి కలిపి నీళ్లు మరిగే వరకు ఉంచాలి.
నీళ్లు మరిగిన తరువాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి కలిపి మూత పెట్టి మధ్యస్థ మంటపై 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత మంటను చిన్నగా చేసి ముందుగా వేయించిపెట్టుకున్న జీడిపప్పును, కొత్తిమీరను, మరికొద్దిగా నెయ్యిని అన్నం పైన వేసి మూత పెట్టి అన్నం పూర్తి ఉడికే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నెయ్యి అన్నం తయారవుతుంది. దీనిని పప్పు, కుర్మా వంటి కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు నెయ్యి అన్నాన్ని వండుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.