టాటూ… దీని గురించి తెలియని వారుండరు. ప్రధానంగా యువత టాటూ అంటే అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తారు. ఒక్కొక్కరు తమ తమ అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల టాటూలను వేయించుకుని అందరికీ చూపించేందుకు తాపత్రయ పడుతుంటారు. కొంత మంది అలంకార ప్రాయంగా టాటూలను వేయించుకుంటే కొందరు ఏదో ఒక అర్థం వచ్చేలా టాటూ వేయించుకుంటారు. ఇంకొందరు తమకు ఇష్టమైన బొమ్మలు, అక్షరాలను టాటూలుగా వేయించుకుంటారు. అయితే టాటూ వేయించుకోవడం వరకు బాగానే ఉన్నా దాని వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో అసలు టాటూల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.
మేరీ లీగర్ అనే డాక్టర్ టాటూలు వేయించుకున్న 300 మందిపై పరిశోధన చేసింది. వారు టాటూలు వేయించుకున్న సమయం, ఆ సందర్భంలో వారికి కలిగిన అనారోగ్య సమస్యలు, టాటూలు వేయించుకున్న తరువాత తలెత్తిన అనారోగ్య సమస్యలు తదితర అన్ని విషయాలను, వివరాలను ఆమె సేకరించింది. చివరకు తెలిసిందేమిటంటే పైన చెప్పిన 300 మందిలో 10 శాతం మంది టాటూల కారణంగా ఒక మోస్తరు అనారోగ్య సమస్యల నుంచి తీవ్రమైన అనారోగ్యాల బారిన పడ్డారని తేలింది.
టాటూలు వేయించుకున్న ప్రతి 10 మందిలో 6 గురికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తినట్టు పరిశోధనలో తెలిసింది. ఈ పరిశోధన సారాంశం మొత్తాన్ని కాంటాక్ట్ డెర్మిటైటిస్ అనే జర్నల్‌లో కూడా ప్రచురించారు. టాటూలలో వాడే ఎరుపు రంగు డై, బ్లాక్ ఇంక్‌లలో నైట్రోజన్, కార్బన్ సంబంధ పదార్థాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధన చేసిన వైద్యులు వెల్లడించారు. వీటి కారణంగా అధిక శాతం వరకు చర్మ సంబంధ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు వస్తాయట. పైన చెప్పిన పరిశోధనలో పాల్గొన్నవారిలో ప్రతి 10 మందిలో ఒకరికి టాటూ వేయించుకున్న ప్రదేశంలో తీవ్రమైన దురద, ఇన్‌ఫెక్షన్, సంబంధిత ప్రదేశంలో చర్మం వాపుకు గురవడం వంటి అనారోగ్య సమస్యలు వచ్చాయట.
పైన చెప్పిన విధంగా ఒకవేళ ఎవరికైనా టాటూ వేయించుకునే సందర్భంలో అలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే టాటూను వేయించుకోవడం ఆపేయాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే అవి తీవ్ర అనారోగ్య సమస్యలుగా మారి క్యాన్సర్ వంటి రోగాలకు దారి తీసే అవకాశం లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే టాటూ వేయించుకుని ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారు వెంటనే తమ తమ టాటూలను తొలగించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా కొందరిలో టాటూ తీసివేశాక కూడా కొన్నేళ్ల పాటు అనారోగ్య సమస్యలు అలాగే ఉండడాన్ని పైన చెప్పిన పరిశోధక బృందం గుర్తించింది. ఇప్పుడు తెలుసుకున్నారుగా, టాటూ వల్ల ఎంతటి ప్రమాదం పొంచి ఉందో. ఎందుకు మన ఆరోగ్యాన్ని రిస్క్ చేయడం చెప్పండి. సుబ్బరంగా ఉన్న టాటూను తీయించేసుకోండి, అలాగని కొత్త టాటూను మాత్రం వేయించుకోకండేం!