Curry Leaves : మనం వంటింట్లో చేసే ప్రతి వంటలోనూ కరివేపాకును వేస్తూ ఉంటాం. కరివేపాకును వేయకుండా చాలా మంది వంట చేయరు. వంటల తయారీలో కరివేపాకును వేస్తాం కానీ దీనిని చాలా మంది తినరు. భోజనం చేసేటప్పుడు కరివేపాకును తీసి పక్కన పెట్టే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. దీని వాసనను చాలా మంది ఇష్టపడతారు కానీ తినడానికి ఇష్టపడరు. ఆయుర్వేద నిపుణులు మాత్రం కరివేపాకును తప్పకుండా తినాలని చెబుతున్నారు. కరివేపాకు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుందని దీనిని ఉపయోగించి మనం అనేక రోగాల నుండి బయట పడవచ్చని వారు చెబుతున్నారు. కరివేపాకులో ఉండే ఔషధ గుణాలు ఏమిటి.. దీనిని ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు చెట్టు మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. దీనిని చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. కరివేపాకు చెట్టు మన ఇంట్లో ఉంటే ఔషధ భాండాగారం ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. కరివేపాకును తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. పిల్లల ఎదుగుదలలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కరివేపాకును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఒక కప్పు వేడి పాలలో ఒక టీ స్పూన్ కరివేపాకు పొడిని, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడిని కలిపి తాగితే అజీర్తి సమస్య నుండి బయటపడవచ్చు. ఇలా చేయడం వల్ల జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది. జుట్టు పెరుగుదలకు కూడా కరివేపాకు ఉపయోగపడుతుంది.
100 గ్రాముల కొబ్బరి నూనెలో ఒక గుప్పెడు కరివేపాకు ఆకులను వేసి మరిగించి చల్లగా అయ్యే వరకు ఉంచి వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను జుట్టు కుదుళ్లకు బాగా పట్టించడం వల్ల జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం వంటి సమస్యలు తగ్గి జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మజ్జిగలో కరివేపాకు పొడిని, అల్లాన్ని, ఉప్పును వేసి కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో వేడి తగ్గడమే కాకుండా వేడి వల్ల వచ్చే సెగ గడ్డలు కూడా తగ్గుతాయి. మూత్రపిండాలలో రాళ్లను తొలగించడంలో కూడా కరివేపాకు సహాయపడుతుంది. కరివేపాకు చెట్టు వేర్లను నీళ్లల్లో వేసి మరిగించి వడకట్టాలి. ఈ కషాయాన్ని రోజూ 30 ఎంఎల్ మోతాదులో తాగుతూ ఉండడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు తొలగిపోతాయి.
చెమట ఎక్కువగా పట్టేవారు కరివేపాకును తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కరివేపాకును తినడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. కరివేపాకు రసం రెండు టీ స్పూన్లు, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని కలిపి ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల బద్దకం తగ్గుతుంది. కరివేపాకు ఆకులను నమిలి రసాన్ని మింగడం వల్ల గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు లేని వంట ఉండదు. మనం దీనిని తినడం అలవాటు చేసుకోవడంతోపాటు పిల్లలకు కూడా దీనిని తినడం అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు తెలియజేస్తున్నారు.