Drumstick Flowers : మనకు ఆకు కూరలాగా, కూరగాయలాగా ఉపయోగపడే చెట్లల్లో మునగ చెట్టు కూడా ఒకటి. మునగాకును, మునగకాయలను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. మనకు వచ్చే తీవ్ర అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా మునగ చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. మునగ చెట్టులో ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మునగ చెట్టును ఔషధంగా ఉపయోగించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గు ముఖం పడతాయని నిపుణులు చెబుతున్నారు. మునగ చెట్టు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మునగ పువ్వులు, మునగ వేర్లు, మునగ బెరడు, వావిటి చెట్టు బెరడు, వెల్లుల్లి రెబ్బలను సమపాళ్లలో తీసుకుని విడివిడిగా ఎండబెట్టి పొడిలా చేసి అన్నింటినీ కలపాలి. ఈ పొడి ఎంత పరిమాణంలో ఉంటే అంత పరిమాణంలో పాత బెల్లాన్ని కలిపి రోట్లో వేసి అంతా కలిసేలా బాగా దంచి రేగి గింజల పరిమాణంలో మాత్రలుగా చేసుకోవాలి. రోజుకు రెండు పూటలా వేడి నీటితో కానీ వేడి పాలతో కానీ భోజనానికి అర గంట ముందు అవసరాన్ని బట్టి ఒకటి లేదా రెండు మాత్రల చొప్పున తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల క్రమంగా కీళ్ల పోట్లు తగ్గిపోతాయి.
ఒక పాత్రలో ఒక లీటర్ ఆవు పాలను పోసి అందులో 800 గ్రాముల మునగ పువ్వులను వేసి చిన్న మంటపై ఒక వంతు పాలు మిగిలే వరకు మరిగించిన తరువాత అందులో 200 మిల్లీ లీటర్ల కొబ్బరి నీళ్లను, 200 మిల్లీ లీటర్ల అరటి పండ్ల రసం, 1200 గ్రాముల పంచదార వేసి కలుపుతూ చిన్న మంటపై మరిగిస్తూ ఉండాలి. పాకం వచ్చే ముందు అందులో విత్తనం తీసిన ఎండు ఖర్జూరాలు. యాలకులు, గసగసాలు, చలువ మిరియాలు, జాజికాయ, జాపత్రి, బాదం పప్పు, బూరుగబంక, రావి చెట్టు గింజలు, మర్రి చెట్టు గింజలు, ద్రాక్ష పండ్లు వీటన్నింటిని 10 గ్రాముల మోతాదులో తీసుకుని పొడిగా చేసి జల్లించి ఆ మొత్తం చూర్ణాన్ని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచి దీనిని ఒక జాడీలోకి తీసుకుని వాసన పోకుండా గట్టిగా మూత పెట్టి కదిలించకుండా రెండు వారాల పాటు ఉంచి ఆ తరువాత ఉపయోగించాలి. దీనిని పూటకు 5 గ్రాముల మోతాదులో రెండు పూటలా తీసుకుని వెంటనే ఒక కప్పు వేడి పాలను తాగాలి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల మేహ రోగాలు, అతి మూత్ర రోగాలు, మూత్ర బిగింపు, మూత్ర బంధం వంటి అన్ని రకాల మూత్ర రోగాలు తగ్గిపోవడమే కాకుండా పురుషులల్లో అంతులేనంత వీర్య బలం, దేహ బలం కలుగుతాయి.
మునగ పువ్వులు, తెల్ల జిల్లేడు పూలు, వెల్లుల్లి రెబ్బలు, దోరగా వేయించిన మిరియాలు, విడ లవణాన్ని సమపాళ్లలో తీసుకుని విడి విడిగా ఎండబెట్టి పొడిగా చేసి ఆ పొడులన్నింటినీ కలిపి వాటికి తగినంత వెల్లుల్లి రెబ్బల రసాన్ని, నిమ్మ రసాన్ని కలిపి మెత్తగా నూరి బఠాణీ గింజల పరిమాణంలో మాత్రలుగా చేసి నీడలో ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. వీటిని శరీర బలాన్ని, వయస్సును బట్టి రోజుకు ఒకటి లేదా రెండు మాత్రల చొప్పున వేడి నీటితో లేదా టీ , కాఫీలతో కలిపి సేవిస్తూ ఉంటే తీవ్రమైన దగ్గు, ఆయాసం తగ్గుతాయి. ఈ విధంగా మునగ చెట్టును ఉపయోగించి మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.