Corn Flakes Mixture : మనం అప్పుడప్పుడూ మొక్క జొన్న కంకులను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో, బరువు పెరగడంలో, రక్త హీనతను తగ్గించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ మొక్క జొన్న కంకులను నేరుగా తినడమే కాకుండా ఈ గింజలతో పాప్ కార్న్, పేలాలు, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటిని కూడా తయారు చేస్తారు. వీటిని తినడం వల్ల కూడా మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ మొక్కజొన్న గింజలతో చేసే కార్న్ ఫ్లేక్స్ తో మనం ఎంతో రుచిగా ఉండే మిక్చర్ ను తయారు చేసుకోవచ్చు. ఈ మిక్చర్ ను సాయంత్రం సమయాలలో స్నాక్స్ గా తినవచ్చు. చాలా తక్కువ సమయంలో, చాలా రుచిగా కార్న్ ఫ్లేక్స్ తో మిక్చర్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కార్న్ ఫ్లేక్స్ మిక్చర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కార్న్ ఫ్లేక్స్ – 2 కప్పులు, పల్లీలు – అర కప్పు, జీడి పప్పు – పావు కప్పు, పుట్నాల పప్పు – అర కప్పు, కరివేపాకు – గుప్పెడు, పసుపు – పావు టీ స్పూన్, కారం – తగినంత, ఉప్పు- తగినంత, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
కార్న్ ఫ్లేక్స్ మిక్చర్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె పోసి నూనె బాగా వేడైన తరువాత కార్న్ ఫ్లేక్స్ ను వేసి వేయించి వెంటనే తీసి టిష్యూ ఉంచిన గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో పల్లీలను, జీడి పప్పును, పుట్నాల పప్పును, కరివేపాకును ఒక దాని తరువాత ఒకటి వేసి వేయించి కార్న్ ఫ్లేక్స్ ను ఉంచిన గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పసుపును, ఉప్పును, కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కార్న్ ఫ్లేక్స్ మిక్చర్ తయారవుతుంది. సాయంత్రం సమయాలలో ఈ విధంగా చాలా తక్కువ సమయంలో ఎంతో రుచిగా ఉండే కార్న్ ఫ్లేక్స్ మిక్చర్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఇది భలే రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.