Potato Chips : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన కూరగాయల్లో బంగాళాదుంపలు కూడా ఒకటి. వీటిని మనం తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంపలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. బంగాళాదుంపలతో వివిధ రకాల వంటలతోపాటు కరకరలాడుతూ ఉండే చిప్స్ ను కూడా తయారు చేస్తారు. వివిధ రుచుల్లో ఈ బంగాళాదుంప చిప్స్ మనకు లభిస్తాయి. ఇవి మనకు బయట ఎక్కువగా దొరుకుతాయి. కానీ బయట ఎటువంటి నూనెతో తయారు చేస్తారోనని చాలా మంది వీటిని తినడం మానేస్తారు. బయట దొరికే విధంగా ఉండే ఈ బంగాళాదుంప చిప్స్ ను మనం ఇంట్లోనే చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు. కరకరలాడుతూ ఉండే బంగాళాదుంప చిప్స్ ను ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంప చిప్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – 3 (మధ్యస్థంగా ఉన్నవి), ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, కారం – తగినంత.
బంగాళాదుంప చిప్స్ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపల పై ఉండే పొట్టును తీసి శుభ్రంగా కడగాలి. తరువాత ఒక స్లైసర్ ను తీసుకుని బంగాళాదుంపలను పలుచగా చిప్స్ ఆకారంలో ముక్కలుగా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ఈ ముక్కలను బాగా కడగాలి. తరువాత రెండు టీ స్పూన్ల ఉప్పును వేసి మరలా తగినన్ని నీళ్లు పోసి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత కూడా మరలా ఈ బంగాళాదుంప ముక్కలను 2 నుండి 3 సార్లు నీటితో బాగా కడగాలి.
తరువాత వీటిని ఒక తడి వస్త్రంపై వేసి తడి లేకుండా ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి లేదా ఏదైనా వస్త్రంతో తడి లేకుండా తుడవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత బంగాళాదుంప ముక్కలు అతుక్కోకుండా ఉండేలా ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి. వీటిని మధ్యస్థ మంటపై కలుపుతూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక గిన్నెలోకి లేదా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా వేయించుకున్న బంగాళాదుంపల చిప్స్ పై కొద్దిగా ఉప్పును, కారాన్ని చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల కరకరలాడుతూ ఉండే బంగాళాదుంప చిప్స్ తయారవుతాయి. వీటిని తడి లేని, గాలి తగలని డబ్బాలో నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల వరకు కూడా తాజాగా ఉంటాయి. ఇలా నిల్వ చేసుకున్న బంగాళాదుంప చిప్స్ ను ఎప్పుడుపడితే అప్పుడు తినవచ్చు.