Doodh Peda : మనం ప్రతిరోజూ పాలను లేదా పాల సంబంధిత ఉత్పత్తులను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడంలో, పిల్లల ఎదుగుదలలో పాలు ఎంతగానో ఉపయోగపడతాయని మనందరికీ తెలుసు. కేవలం కాల్షియం ఒకటే కాకుండా పాలను ఆహారంల భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు కూడా లభిస్తాయి. పాలతో మనం ఎంతో రుచిగా ఉండే తీపి పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పాలతో చేసుకోగలిగే తీపి పదార్థాలలో పాలకోవా కూడా ఒకటి.
పాలకోవా మనకు బయట ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అయినప్పటికీ దీనిని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. అందరికీ ఈ పాలకోవాను ఇంట్లో తయారు చేసుకోవడానికి వీలుపడదు. పాలకోవా రుచి ఉండేలా పాలపొడిని ఉపయోగించి కూడా మనం పాలకోవాను తయారు చేసుకోవచ్చు. పాలపొడితో చేసే ఈ పాలకోవాను మనం చాలా సులభంగా కేవలం పదినిమిషాలలోనే తయారు చేసుకోవచ్చు. పాలపొడితో పాలకోవాను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకోవా తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, కాచి చల్లార్చిన పాలు – అర కప్పు, పాల పొడి – ఒకటిన్నర కప్పు, పంచదార పొడి – పావు కప్పు, యాలకుల పొడి – చిటికెడు.
పాలకోవా తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తరువాత పాలను పోయాలి. తరువాత పాలపొడిని, పంచదార పొడిని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై 5 నిమిషాల పాటు దగ్గర పడే వరకు ఉంచాలి. తరువాత యాలకుల పొడిని వేసి కలిపి మరో 2 నిమిషాల పాటు ఉంచాలి. ఈ మిశ్రమం కళాయికి అతుక్కోకుండా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ కావల్సిన పరిమాణంలో మిశ్రమాన్ని తీసుకుంటూ పాలకోవా బిళ్లల ఆకారంలో వత్తుకోవాలి.
ఇలా వత్తుకున్న వాటిని మనకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలకోవా తయారవుతుంది. అప్పటికప్పుడు చాలా సులువుగా చాలా తక్కువ సమయంలోనే ఎంతో రుచిగా తయారు చేసే ఈ పాలకోవాని అందరూ ఇష్టంగా తింటారు. తీపి తినాలనిపించినప్పుడు ఈ విధంగా పాల పొడితో పాలకోవాను తయారు చేసుకుని తినవచ్చు.