Chepala Iguru : మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలను అందించే ఆహారాల్లో చేపలు కూడా ఒకటి. ఇతర మాంసాహార ఉత్పత్తుల కంటే చేపలు త్వరగా జీర్ణమవుతాయి. వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. చేపలతో చేసే వంటకాల్లో చేపల ఇగురు కూడా ఒకటి. చేపల ఇగురు ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చాలా సులభంగా, రుచిగా చేపల ఇగురును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల ఇగురు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేప ముక్కలు – ముప్పావు కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, తరిగిన పచ్చి మిర్చి – 2, కచ్చా పచ్చాగా దంచిన ఉల్లిపాయలు – 2 ( పెద్దవి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్ లేదా తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, టమాటా గుజ్జు – ఒక పెద్ద టమాటాతో చేసినంత, నీళ్లు – 200 ఎంఎల్ లేదా తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చేపల ఇగురు తయారీ విధానం..
ముందుగా చేప ముక్కల్లో కొద్దిగా ఉప్పును, పసుపును, కారాన్ని వేసి ముక్కలకు పట్టేలా బాగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె వేడయ్యాక జీలకర్రను వేసి వేయించుకోవాలి. తరువాత పచ్చి మిర్చిని, ఎండు మిర్చిని వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయలను వేసి అవి రంగు మారే వరకు వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట గుజ్జును, పసుపును, రుచికి తగినంత ఉప్పును, కారాన్ని అలాగే జీలకర్ర పొడిని, ధనియాల పొడిని వేసి కలిపి 5 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత చేప ముక్కలను వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత చేప ముక్కలను మరో వైపుకు తిప్పి మరలా మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత నీళ్లను పోసి ముక్కలు విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించి పైన కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చేపల ఇగురు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.