Veg Noodles : మనం బయట ఎక్కువగా దొరికే చిరుతిళ్లలో నూడుల్స్ కూడా ఒకటి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి మనకు హోటల్స్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లల్లో లభిస్తూ ఉంటాయి. ఈ నూడుల్స్ మనకు వివిధ రుచుల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో వెజ్ నూడుల్స్ కూడా ఒకటి. బయట లభించే విధంగా ఉండే ఈ వెజ్ నూడుల్స్ ను మనం ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. వెజ్ నూడుల్స్ ను ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ నూడుల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూడుల్స్ – ఒక ప్యాకెట్, నీళ్లు – ఒక లీటర్, నూనె – ఒక టేబుల్ స్పూన్, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 2, చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు – ఒక టేబుల్ స్పూన్, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – ఒక కప్పు, తరిగిన క్యాప్సికం ముక్కలు – ఒక కప్పు, తరిగిన క్యారెట్ ముక్కలు – అర కప్పు, క్యాబేజ్ తురుము – అర కప్పు, సోయా సాస్- ఒక టేబుల్ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ – అర టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు – కొద్దిగా.
వెజ్ నూడుల్స్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నీళ్లు పోసి నీళ్లు మరిగిన తరువాత ఒక లేదా రెండు టీ స్పూన్ల ఉప్పు వేసి కలపాలి. తరువాత నూడుల్స్ ను వేసి మధ్యస్థ మంటపై 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత నూడుల్స్ లో ఉన్న నీటిని పారబోసి మరలా వాటిలో చల్లని నీళ్లను పోసి కడగాలి. తరువాత ఈ నూడుల్స్ ను జల్లిగిన్నెలోకి తీసుకుని నీళ్లని పోయేలా చేసుకోవాలి. తరువాత మరొక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత పచ్చి మిర్చిని, వెల్లుల్లిపాయలను వేసి అర నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత క్యాప్సికం ముక్కలను, క్యారెట్ ముక్కలను, క్యాబేజ్ తురుమును వేసి కలుపుతూ వేయించుకోవాలి.
వీటన్నింటినీ కూడా పూర్తిగా వేయించుకోకూడదు. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఉప్పును వేసి కలుపుకోవాలి. తరువాత సోయాసాస్, వెనిగర్, మిరియాల పొడి, రెడ్ చిల్లీ సాస్ ను వేసి కలుపుకోవాలి. తరువాత ముందుగా ఉడికించిన నూడుల్స్ ను వేసి అన్నీ కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వాటిపై తరిగిన ఉల్లికాడలను చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల బయట లభించే విధంగా ఉండే వెజ్ నూడుల్స్ తయారవుతాయి. బయట అపరిశుభ్ర వాతావరణంలో విక్రయించే నూడుల్స్ ను తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే నూడుల్స్ ను చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది.