Almond Milk : మనం ఆహారంలో తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పు కూడా ఒకటి. బాదం పప్పును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజాలను పొందవచ్చు. బాదంపప్పులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఎముకలను దృఢంగా ఉంచడంలో, బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో బాదం పప్పు ఎంతగానో సహాయపడుతుంది. కొందరు వీటిని నేరుగా నీటిలో నానబెట్టుకుని తింటారు. కొందరూ తీపి పదార్థాల తయారీలో వేస్తూ ఉంటారు. అంతేకాకుండా బాదంపప్పులతో బాదం పాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. బాదం పాలు ఎంతో రుచిగా ఉంటాయి. బాదం పాలను తాగడం వల్ల మనకు పాలలో ఉండే పోషకాలతోపాటు బాదం పప్పులో ఉండే పోషకాలు కూడా లభిస్తాయి. ఈ బాదం పాలు మనకు బయట ఎక్కువగా దొరుకుతాయి. వీటిని మనం ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో బాదం పాలను ఎలా తయారు చేసుకోవాలి.. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం పాలు తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలు – అర లీటర్, నానబెట్టిన బాదం పప్పులు – 20 నుండి 25, యెల్లో ఫుడ్ కలర్ – చిటికెడు, యాలకుల పొడి – చిటికెడు, పంచదార – పావు కప్పు లేదా తగినంత.
బాదం పాలు తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో నానబెట్టుకున్న బాదం పప్పులను పొట్టు తీసి వేసుకోవాలి. అందులోనే అర కప్పు కాచి చల్లార్చిన పాలను పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో పాలను పోసి చిన్న మంటపై పాలు ఒక పొంగు వచ్చే వరకు కలుపుతూ మరిగించాలి. పాలు మరిగిన తరువాత మిక్సీ పట్టుకున్న బాదం పప్పు మిశ్రమాన్ని వేసి పాలు కొద్దిగా రంగు మారే వరకు మరిగించాలి. తరువాత ఫుడ్ కలర్ ను, యాలకుల పొడిని వేసి కలపాలి. తరువాత పంచదారను వేసి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని ఒక గ్లాస్ లోకి తీసుకుని పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బాదం పాలు తయారవుతాయి. ఈ పాలను వేడిగా తాగవచ్చు. లేదా ఫ్రిజ్ లో పెట్టుకుని చల్లగా అయిన తరువాత కూడా తాగవచ్చు. ఈ విధంగా బాదం పాలను చేసుకుని తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.