Eyes : మనలో ప్రతి ఒక్కరూ కళ్లు అందంగా కనబడాలని.. అదేవిధంగా కళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ మారుతున్న జీవన విధానం, వాతావరణ కాలుష్యం, డిజిటల్ వస్తువుల వాడకం ఎక్కువ అవడం, పోషకాహార లోపం, శ్రమ జీవనం వంటి కారణాల వల్ల మన కళ్ల అందం, ఆరోగ్యం రెండూ దెబ్బతింటున్నాయి. కళ్ల కింద ముడతలు, కంటి చుట్టూ నల్లని వలయాకార మచ్చలతోపాటు కంటి చూపు మందగించడం వంటి సమస్యల బారిన పడుతున్నాం. ఎటువంటి ఖర్చు లేకుండానే కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం కంటి చూపుతోపాటు కళ్ల అందాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు.
కళ్ల అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు తరచూ ముఖాన్ని, కళ్లను కడుగుతూ ఉంటారు. కళ్లను రోజుకు కేవలం రెండుసార్లు మాత్రమే నీటితో కడగాలి. రెండు కంటే ఎక్కువ సార్లు కళ్లను కడగకూడదు. అదే విధంగా వారానికి ఒకసారి విటమిన్ ఇ నూనెతో కంటి రెప్పలపై, కంటి చుట్టూ మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల కంటి చుట్టూ ఉండే వృత్తాకార నల్లని వలయాలు తగ్గు ముఖం పట్టి కళ్లు అందంగా కనబడతాయి. కళ్లు అలసటకు గురయినప్పుడు కళ్లు మూసుకుని కనురెప్పల మీద కీరదోస ముక్కలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు తగినంత విశ్రాంతి లభించి కంటిచూపు దెబ్బతినకుండా ఉంటుంది. కళ్లు కూడా కాంతివంతంగా కనబడతాయి.
అలాగే రోజూ రాత్రి పడుకునే ముందు కళ్లతో సహా ముఖాన్ని శుభ్రంగా కడిగి గులాబీ నీటిని రాసుకుని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లతోపాటు ముఖం కూడా నిగారింపును సొంతం చేసుకుంటుంది. అదే విధంగా మంచి నీటిని కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి. రోజుకు కనీసం ఎనిమిది నుండి పది గ్లాసుల నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల కళ్ల అందం, ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. ఒక టీ స్పూన్ పసుపులో ఆలివ్ నూనెను కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రాసి ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కంటి కింద ఉండే నల్లని వలయాకారపు మచ్చలు, ముడతలు తగ్గి కళ్లు అందంగా కనబడతాయి.
అలాగే విటమిన్ ఎ, విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను, పండ్లను, కూరగాయలను తినడం వల్ల కంటి చూపు మెరుగుపడడమే కాకుండా కళ్లు అందంగా కూడా కనబడతాయి. ఈ చిట్కాలను పాటించడంతోపాటు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలి. కంటి చూపును మెరుగుపరిచే ఆహారాలను తీసుకోవాలి. కంటి వ్యాయామాలు చేస్తూ తగినంతంగా నిద్ర పోవడం వల్ల కళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.