Beauty Tips : అందంగా కనబడాలని మనలో చాలా మంది కోరుకుంటారు. అందంగా కనబడడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఎంతో ఖర్చు కూడా చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే అన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు. అధిక ధరను వెచ్చించి మరీ ఫేస్ ప్యాక్ లను, ఫేస్ వాష్ లను, క్రీములను కొనుగోలు చేసి ఉపయోగిస్తూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు తగ్గక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎటువంటి ప్రొడక్ట్స్ ను, చిట్కాలను వాడినప్పటికీ సమస్యలు తగ్గి అందం మొరుగుపడకపోవడానికి కారణం అన్ని వయస్సుల వారు ఒకే రకమైన ఫేస్ ప్యాక్ లను వాడడమే.
వయస్సును బట్టి మనకు చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. చర్మ సంబంధిత సమస్యలు తగ్గి అందంగా కనబడాలంటే వయసుకు తగిన విధానాన్ని అనుసరించాలి. వయసుకు తగిన విధంగా ఫేస్ ప్యాక్ లను చేసుకుని వాడితే మంచి ఫలితం ఉంటుంది. 15 నుండి 20 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి ఎక్కువగా ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీరు వారి వయసుకు తగినట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఫేస్ ప్యాక్ లను వాడాల్సి ఉంటుంది. ఈ వయసులో ఉన్న వారు ముఖాన్ని రోజుకు కనీసం రెండు నుంచి మూడు సార్లు వేడి నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మలినాలు తొలగిపోయి మొటిమలు రాకుండా ఉంటాయి. అలాగే బియ్యం కడిగిన నీటిని, కీర దోసకాయ గుజ్జును ముఖానికి రాసుకుని ఆరిన తరువాత కడిగేయాలి. బియ్యం కడిగిన నీరు, కీర దోసకాయ గుజ్జు ముఖానికి టోనర్ లా పని చేస్తాయి.
శరీరంలో వ్యర్థ పదార్థాలు ఎక్కువగా ఉన్నా కూడా మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ద్రాక్ష పండ్లను, ఆపిల్ పండ్లను, నారింజ పండ్లను నేరుగా తినడం లేదా జ్యూస్ గా చేసుకుని తాగడం వంటివి చేస్తూ ఉండాలి. అలాగే నిమ్మకాయ రసాన్ని కూడా ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా ముఖంపై మొటిమల సమస్యతో బాధపడే వారు కోడిగుడ్డు తెల్లసొనలో మూడు చుక్కల నిమ్మ రసాన్ని కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గడంతోపాటు ముఖం కాంతివంతంగా కనబడుతుంది.
అలాగే 20 నుండి 40 సంవత్సరాల వారికి మొటిమలతోపాటు కళ్ల కింద నల్లని వలయాకార మచ్చలు, ముడతలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ వయసు వారు వారి వయసుకు తగిన ఫేస్ ప్యాక్ లను వాడాల్సి ఉంటుంది. ఈ వయసు వారు మూడు చెంచాల టమాట రసంలో తేనెను కలిపి ముఖానికి రాసి మర్దనా చేసి ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా చేయడంవల్ల మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గిపోతాయి. ఒక ఆలు గడ్డను గుండ్రంగా ముక్కలుగా కోసి కళ్లపై ఉంచుకోవడం వల్ల కూడా కంటి చుట్టూ ఉండే మచ్చలు తొలగిపోతాయి. అదే విధంగా తగినంత నిద్రపోవడం, రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు తాగడం వంటివి చేయడం వల్ల కూడా కళ్ల కింద మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. ఈ విధంగా వయసుకు తగినట్టుగా ఫేస్ ప్యాక్ లను వాడడం వల్ల మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు.