Beauty Tips : ప్రస్తుత కాలంలో ముఖంపై అవాంఛిత రోమాల సమస్యతో అనేక మంది స్త్రీలు బాధపడుతున్నారు. ఈ అవాంఛిత రోమాలు ముఖంపై, పెదవులపై, గడ్డంపై ఎక్కువగా వస్తూ ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ముఖంపై ఇలా అవాంఛిత రోమాలు వస్తాయి. అవాంఛిత రోమాల కారణంగా ముఖం అందవిహీనంగా కనబడుతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి స్త్రీలు వ్యాక్సింగ్, షేవింగ్, త్రెడింగ్ వంటి వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు. అవి అన్నీ కూడా నొప్పిని కలిగించేవే.
షేవింగ్ కారణంగా చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. అలాగే షేవింగ్ చేసే ప్రాంతంలో చర్మం నల్లగా కూడా మారుతుంది. ఎటువంటి నొప్పి, దుష్పభ్రావాలు లేకుండానే చాలా సులువుగా మనం ఈ అవాంఛిత రోమాల సమస్య నుండి బయటపడవచ్చు. ఇంట్లోనే చాలా సులువుగా ఓ పేస్ట్ ను తయారు చేసుకుని వాడడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ పేస్ట్ ను వాడడం వల్ల చర్మం కాంతివంతంగా కూడా తయారవుతుంది. అవాంఛిత రోమాలను తొలగించే పేస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. ఈ పేస్ట్ ను ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందుకోసం మనకు టమాట రసం, తేనె, పసుపు, జెలెటిన్ లు అవసరమవుతాయి. జెలెటిన్ మనకు బయట మార్కెట్ లో దొరుకుతుంది. దీనిని ఎక్కువగా జామ్ లు, మ్యాంగో జెల్ వంటి పదార్థాలను తయారు చేయడంలో ఉపయోగిస్తారు. ముందుగా ఒక చిన్న స్టీల్ గిన్నెను తీసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ టమాట రసాన్ని లేదా ఒక టీ స్పూన్ నిమ్మ రసాన్ని తీసుకోవాలి. తరువాత అందులో ఒక టీ స్పూన్ తేనెను కలపాలి. తరువాత ఒక చిటికెడు పసుపును వేసి కలపాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ జెలెటిన్ ను కలపాలి.
ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నీటిని తీసుకుని నీటిని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక మనం తీసుకున్న స్టీల్ గిన్నెను ఆ నీటిలో ఉంచి జెలెటిన్ కరిగి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత గిన్నెను బయటకు తీయాలి. ఈ పేస్ట్ చల్లగా అయ్యి గట్టిపడడానికి ముందే ఉపయోగించాలి. తరువాత ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుని తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ను అవాంఛిత రోమాల మీద అవి పెరుగుతున్న దిశలో మందంగా రాయాలి. ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత దానిని చేతి వేళ్లతో నెమ్మదిగా తొలగించాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.
ఈ పేస్ట్ పీలర్ లా పని చేసి అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. ఈ పేస్ట్ ను వాడడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ చిట్కాను నెలకు రెండు సార్లు పాటించడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోవడమే కాకుండా వాటి పెరుగుదల కూడా తగ్గుతుంది.