Idli With Oats : ఉదయం పూట అల్పాహారం చేయడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. రోజంతా చక్కగా పని చేయాలంటే మనం ఉదయం పూట కచ్చితంగా అల్పాహారం చేయాలి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా అల్పాహారం చేయడం తప్పనిసరి. ఈ అల్పాహారాన్ని చేయడం గనుక మానేశామో ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం వివిధ రకాల అల్పాహారాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మనం తయారు చేసే అల్పాహారాల్లో ఇడ్లీ కూడా ఒకటి.
మనం తినే అల్పాహారాల్లో అన్నింటి కంటే ఇడ్లీ ఉత్తమమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇడ్లీలను తయారు చేయడానికి మనం ఎక్కువగా నూనెను ఉపయోగించము. అలాగే ఇవి త్వరగా జీర్ణమవుతాయి. ఇడ్లీలను తయారు చేయడానికి ఉపయోగించే మినప పప్పు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారు ఇడ్లీలను ఓ విధంగా తయారు చేసుకుని తింటే సులువుగా బరువు తగ్గుతారట. బరువు తగ్గాలనుకునే వారు ఇడ్లీ పిండిలో ఓట్స్ ను పొడిగా చేసి వేయాలి. ఇలా తయారు చేసిన పిండితో ఇడ్లీలను చేసి తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకు కారణం ఓట్స్ కు క్యాలరీలను తగ్గించే గుణం ఉండడమే.
ఓట్స్ లో పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయడంతోపాటు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును వేగంగా కరిగించడంలో కూడా సహాయపడతాయి. కనుక మనం తయారు చేసుకునే ఇడ్లీ పిండిలో కొద్దిగా ఓట్స్ పొడిని కలిపి తినాలి. అలా తినడం వల్ల పిల్లలకి, పెద్దలకి మంచి శక్తి అందడంతోపాటు బీపీ, షుగర్ వంటి వ్యాధులు కూడా నియంత్రణలో ఉంటాయి.
ఈ ఓట్స్ ఇడ్లీ తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఓట్స్ తో ఇడ్లీలను తయారు చేసుకుని తినడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.