Ear Pain : మనల్ని అప్పుడప్పుడూ చెవిపోటు సమస్య కూడా వేధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెవిలో ఇన్ ఫెక్షన్ ల కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. జలుబు, సైనుసైటిస్ వల్ల కూడా చెవిపోటు వచ్చే అవకాశం ఉంటుంది. చెవిపోటు సమస్యతో ఇబ్బందిపడే వారి సమస్యను వర్ణించడం చాలా కష్టం. అలాగే ఒక్కోసారి చెవి నుండి రక్తం, చీము కూడా కారుతూ ఉంటాయి. చెవిపోటు కారణంగా జ్వరం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యతో బాధపడే వారు స్నానం చేసేటప్పుడు చెవిలో దూది పెట్టుకోవాలి. చెవిలోకి నీళ్లు పోకుండా చూసుకోవాలి. చెవిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. చెవిపోటు సమస్యను అలాగే చెవి నుండి చీము, రక్తం కారడాన్ని కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల వెంటనే తగ్గించుకోవచ్చు.
చెవిపోటు సమస్యను తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చెవి నొప్పిని తగ్గించడంలో అల్లం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా ఒక అర కప్పు అల్లం రసాన్ని తీసుకుని గిన్నెలో పోసి బాగా మరిగించాలి. తరువాత ఈ రసాన్ని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న అల్లం రసాన్ని రోజుకు నాలుగు నుండి ఐదు సార్లు చెవిలో కొద్ది కొద్దిగా వేసుకోవాలి. అల్లం రసం ఉపయోగించిన ప్రతిసారి అది గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.
అదే విధంగా వెల్లుల్లి రెబ్బలను ఉపయోగించి కూడా మనం చెవి నొప్పిని తగ్గించుకోవచ్చు. కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ కు కొద్దిగా ఉప్పును కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక శుభ్రమైన వస్త్రంలో ఉంచి మూట కట్టాలి. ఈ మూటను చెవి పై ఉంచుకోవడం వల్ల చెవిలో ఉండే ఇన్ ఫెక్షన్ లు తగ్గి చెవినొప్పి తగ్గుతుంది. అలాగే శుభ్రపరిచిన తులసి ఆకుల రసాన్ని చెవిలో వేసుకోవడం వల్ల ఇన్ ఫెక్షన్ ల కారణంగా వచ్చే చెవిపోటు తగ్గుతుంది.
చెవి నుండి చీము కారడాన్ని తగ్గించడంలో ఇంగువ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చెవి నుండి చీము కారడం సమస్యతో బాధపడే వారు ముందుగా ఒక గిన్నెలో కొబ్బరి నూనెను తీసుకుని వేడి చేయాలి. తరువాత అందులో ఇంగువను వేసి వేడి చేయాలి. ఇంగువ పొంగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి నూనె గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి నూనెను చెవిలో వేసుకోవడం వల్ల చెవి నుండి చీము కారడం తగ్గుతుంది.
అదే విధంగా ఒక గిన్నెలో ఆవ నూనెను తీసుకుని వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో మెంతులను వేసి రంగు మారే వరకు వేయించాలి. ఇలా తయారు చేసిన నూనెను గోరు వెచ్చగా అయిన తరువాత చెవిలో వేసుకోవడం వల్ల చెవి నుండి చీము కారడం, చెవి నొప్పి తగ్గుతుంది. అలాగే ఒక గిన్నెలో ముల్లంగి పేస్ట్ ను, వెల్లుల్లి రెబ్బల పేస్ట్ ను, మునగాకుల పేస్ట్ ను వేసి వేడి చేయాలి. ఈ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తరువాత చెవిలో వేసుకోవడం వల్ల చెవి నొప్పి తగ్గుతుంది.
అలాగే చెవి నుండి దుర్వాసన వస్తునప్పుడు చెవిలో వెల్లుల్లి రెబ్బలను ఉంచడం వల్ల వాసన రావడం తగ్గడమే కాకుండా చెవి నొప్పి కూడా తగ్గుతుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల చెవిపోటు, చెవిలో ఇన్ ఫెక్షన్ లు, చెవి నుండి చీము కారడం వంటి సమస్యలు తగ్గుతాయి.