Kaju Masala Curry : మనం ఆహారంగా తీసుకునే డ్రై నట్స్ లో జీడిపప్పు ఒకటి. దీనిని తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. జీడిపప్పును తినడమే కాకుండా దీనితో వంటలను కూడా తయారు చేస్తూ ఉంటాం. జీడిపప్పుతో చేసుకోదగిన వంటల్లో కాజు మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా సులభం. కాజు మసాలా కర్రీని రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాజు మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
జీడిపప్పు పలుకులు – పావు కప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – 1, లవంగాలు – 4, అనాస పువ్వు – 1, యాలకులు – 2, చిన్న బిర్యానీ ఆకు – 1, చిన్న ముక్కలుగా తరిగిన టమాటాలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), పసుపు – అర టీ స్పూన్, బటర్ – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కసూరి మెంతి – కొద్దిగా.
కాజు మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జీడిపప్పు పలుకులను తీసుకోవాలి. అందులో అర కప్పు నీటిని పోసి 2 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడయ్యాక మసాలా దినుసులను, పది జీడిపప్పు పలుకులను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత టమాట ముక్కలను, పావు టీ స్పూన్ పసుపును వేసి కలపాలి. కళాయిపై మూతను ఉంచి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ ముక్కలు చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకుని వీలైనంత మెత్తగామిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు అదే కళాయిలో నూనె, బటర్ వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి మాడిపోకుండా వేయించాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టిన టమాట మిశ్రమాన్ని వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులను నీటితో సహా వేయాలి. అవసరమైతే మరికొన్ని నీటిని కూడా వేసి దగ్గర పడే వరకు ఉడికించాలి.
తరువాత ఫ్రెష్ క్రీమ్ ను వేసి కలిపి 5 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కసూరి మెంతిని, కొత్తిమీరను వేసి మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అచ్చం హోటల్స్ లో లభఙంచే విధంగా ఉండే కాజు మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని రోటీ, చపాతీ, పుల్కా, పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కాజు కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా దీనిని తినడం వల్ల రుచితోపాటు జీడిపప్పును తినడం వల్ల కలిగే లాభాలను కూడా పొందవచ్చు.