Phone Talk : ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సెల్ ఫోన్ ను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సెల్ ఫోన్ ను మితిమీరి వాడడం వల్ల చర్మం దెబ్బతింటుందట. ఈ మాట వినగానే మనలో చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. కానీ ఇది నిజం. సెల్ ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడడం వల్ల మొటిమలు, అలర్జీలు, చర్మం పై ముడతలు, నల్ల మచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చే ప్రమాదం ఉందట.
మొబైల్ పై సూక్ష్మ క్రిములు పేరుకుపోయి ఉంటాయి. ఫలితంగా చర్మంపై మొటిమలు వస్తాయి. ముఖానికి దగ్గరగా పెట్టుకుని మాట్లాడడం వల్ల ముఖానికి ఉన్న మేకప్, రాసుకున్న క్రీమ్, చెమట వంటివి సెల్ ఫోస్ స్క్రీన్ కు అంటుకుంటాయి. అలాగే చాలా మందికి సెల్ ఫోన్ ను బాత్ రూమ్ లోకి తీసుకువెళ్లే అలవాటు ఉంటుంది. దీని వల్ల మొబైల్ పై ఎక్కువ సూక్ష్మ క్రిములు చేరే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే తరచూ మొబైల్ ఫోన్ ను శుభ్రం చేయాలి.
40 శాతం ఆల్కహాల్ ఉన్న ద్రవ రూపంలోని క్లీనర్స్ తో మొబైల్ ను తుడవాలి. ఇయర్ ఫోన్స్ ను వాడితే మంచిది. మొబైల్ వాడడం వల్ల చెంపలపై దద్దుర్లు, అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ల స్క్రీన్ లపై నికెల్, క్రోమియంలు ఉంటాయి. వీటి వల్ల ముఖంపై అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. మొబైల్ స్ర్కీన్ లపై ప్లాస్టిక్ కేస్ లను వాడితే మంచిది. గంటల కొద్దీ సెల్ ఫోన్ ను చూడడం వల్ల మెడ కింద, గడ్డం కింద ముడతలు ఏర్పడతాయి. ఫోన్ వేడి కారణంగా ముఖంపై నల్లని మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత తక్కువగా ఫోన్ లో మాట్లాడితే మేలు.