Mughlai Paratha : మనం ఆహారంలో భాగంగా గోధుమ పిండితో వివిధ రకాల పరాఠాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో ముగులై వెజ్ పరాఠాలు కూడా ఒకటి. ఈ పరాఠాలను మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ముగులై వెజ్ పరాఠాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే అనేక పోషక విలువలు కూడా కలిగి ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభమే. ముగులై వెజ్ పరాఠాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముగులై వెజ్ పరాఠా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ పిండి – ఒక కప్పు, గోరు వెచ్చని నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్ – 2, చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, క్యాబేజ్ తురుము – పావు కప్పు, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్, పన్నీర్ తురుము – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ముగులై వెజ్ పరాఠా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, గోరు వెచ్చని నూనె వేసి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత గిన్నెపై మూతను ఉంచి 20 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
తరువాత ఫ్రెంచ్ బీన్స్, క్యాప్సికం ముక్కలు, క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము వేసి కలపాలి. వీటిని మెత్తగా అయ్యే వరకు చిన్న మంటపై మూత పెట్టి కలుపుతూ వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం వేసి కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత పన్నీర్ తురుమును వేసి కలుపుతూ మరో రెండు నిమిషాల పాటు వేయించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కకు ఉంచాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి బాగా కలపాలి. తరువాత ఈ పిండిని ముద్దలుగా చేసి గిన్నెపై మూతను ఉంచాలి. ఇప్పుడు ఒక్కో పిండి ముద్దను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా చేసుకోవాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న మిశ్రమాన్ని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుని చపాతీ మధ్యలో ఉంచాలి. ఇప్పుడు చపాతీ అంచులకు నీటిని రాసి చతురస్రాకారంలో అంచులను మూసి వేయాలి. ఇలా అన్ని పరాఠాలను తయారు చేసుకున్న తరువాత పెనం మీద వేసి అటూ ఇటూ 10 సెకన్ల పాటు కాల్చుకోవాలి.
తరువాత నూనె వేసి రెండు వైపులా చపాతీని కాల్చుకునే విధంగా కాల్చుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఉండే ముగులై పరాఠాలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ ముగులై పరాఠాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.