Chikkudukaya Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో చిక్కుడుకాయలు కూడా ఒకటి. వీటిని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. చిక్కడుకాయలతో చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. కానీ చిక్కుడుకాయ వేపుడు పొడి పొడిగా ఉండడం వల్ల అన్నంతో సరిగ్గా కలవదు. కనుక చిక్కుడుకాయ వేపుడును మెత్తగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్కుడుకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
ముక్కలుగా చేసిన చిక్కుడు కాయలు – పావు కిలో, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, ధనియాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు – పావు కప్పు, ఎండుమిర్చి – 5 లేదా 6, వెల్లుల్లి రెబ్బలు – 5, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, మినప పప్పు – అర టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చిక్కుడుకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలు, శనగ పప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చికొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో చిక్కుడుకాయ ముక్కలను, కొద్దిగా ఉప్పును, కొద్దిగా నీటిని వేసి ఉడికించాలి. ఈ ముక్కలను 5 నుండి 10 నిమిషాల పాటు ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని వడకట్టుకోవాలి.
తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు దినుసులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలను వేసి కలపాలి. తరువాత పసుపును వేసి కలుపుతూ 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడిని వేసి కలపాలి. ఇందులోనే రుచికి తగినంత మరికొద్దిగా ఉప్పును వేసి కలిపి మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ వేపుడు తయారవుతుంది. ఇలా చేసిన చిక్కుడుకాయ వేపుడు అన్నంలో చక్కగా కలుస్తుంది. దీనిని అన్నంతోపాటు చపాతీ, పుల్కా వంటి వాటితో కూడా కలిపి తినవచ్చు. ఇలా చేసిన చిక్కుడకాయ వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.