Gongura Tomato Curry : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో గోంగూర కూడా ఒకటి. గోంగూరలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. గోంగూరతో మనం ఎక్కువగా పచ్చడి, పప్పు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా గోంగూరలో టమాటాలను వేసి మనం కూరగా కూడా చేసుకోవచ్చు. ఈ గోంగూర టమాట కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర టమాట కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంగూర కట్టలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – 4 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 10 నుండి 15, కరివేపాకు – ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన టమాట – 1 (పెద్దది), పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత.
గోంగూర టమాట కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలోనూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకును వేయాలి. తరువాత వీటిపై మూతను ఉంచి 5 నుండి 10 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలను వేసి కలిపి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత శుభ్రంగా కడిగిన గోంగూరను వేసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి గోంగూర దగ్గర పడే వరకు ఉడికించాలి.
గోంగూర దగ్గరగా అయిన తరువాత ఒక గంటెను తీసుకుని కూర అంతటినీ వీలైనంత మెత్తగా చేసుకోవాలి. తరువాత దీనిపై మరలా మూతను ఉంచి నూనె పైకి తేలే వరకు 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర టమాట కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, పులావ్, బగారా అన్నం వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గోంగూరతో తరచూ చేసే వంటకాలకు బదులుగా ఇలా టమాటాలను వేసి కూరగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన గోంగూర టమాట కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.