Meals : మన శరీరానికి ఆహారం ఎంతో అవసరం. మనకు శక్తిని ఇచ్చేది మనం తీసుకునే ఆహారమే. మనం ఆరోగ్యంగా ఉండాలంటే భోజనానికి సంబంధించిన కొన్ని నియమాలను తప్పకుండా పాటించాల్సిందేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ఆహార నియమాలు మనకు తెలిసినా కూడా మనం వాటిని పాటించం. కానీ ఈ ఆహార నియమాలను పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మనం పాటించాల్సిన భోజన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే పరగడుపున లీటర్ నీటిని తాగాలి. ఆ తరువాత తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
శరీర కదలికలను బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అలాగే ఉదయం అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. అల్పాహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రాత్రి పూట జరిగిన జీర్ణక్రియలో భాగంగా శరీరానికి కావల్సిన శక్తి ఉదయం మనం తీసుకునే అల్పాహారం నుండే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం అల్పాహారాన్ని తీసుకోవడం వల్ల నూతనోత్తేజంతో మనం మన పనులను చేసుకోగలుగుతాం. అలాగే మధ్యాహ్నం నిర్ణీత వేళ వరకు భోజనం ముగించాలి. ఆహారం తినేటప్పుడు బాగా నమిలి తినాలి. అంతేకానీ గబగబా మింగేయకూడదు. ఆహారాన్ని నమిలి తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
అదే విధంగా భోజనం తినేటప్పుడు కడుపు నిండుగా భుజించకూడదు. ఎంత రుచిగా ఉన్నా కూడా మనకు తగినంత ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కడుపులో పావు వంతు భాగాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచాలి. సహజంగా చాలా మంది ఆకలివేసినప్పుడు నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. అలా చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగాలనిపిస్తే కొద్ది మోతాదులో నీటిని మాత్రమే తాగాలి. భోజనానికి అర గంట ముందు అలాగే భోజనం తరువాత అరగంట వరకు నీటిని తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే భోజనం చేసేటప్పుడు పూర్తిగా నేల మీద కూర్చొని తినాలి లేదా పాలు పితికే భంగిమలో కూర్చొని తినాలి. పూర్తిగా కింద కూర్చొని తినడం వల్ల జఠర రసం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యి శరీరానికి త్వరితగతిన శక్తి లభిస్తుంది. ఇలా కింద కూర్చొని భోజనం చేసే సమయంలో మన ప్లేట్ కొద్దిగా ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. ఇక రెండవది పాలు పితికే భంగిమలో కూర్చొని తినడం. ఈ భంగిమ శారీరక శ్రమ చేసే వారికి ఉత్తమమైనది. పొట్ట ఉన్న వారు ఈ భంగిమలో కూర్చొని తింటే వారి పొట్ట కొద్దికొద్దిగా తగ్గుతుంది. ఇలా తినడం అలవాటు చేసుకుంటే శరీరం, మనసు నిత్య యవ్వనంగా ఉంటాయి.
కొందరు నిలబడి భోజనం చేస్తూ ఉంటారు. నిలబడి భోజనం చేయడం వల్ల మన శరీరంలో కొవ్వు పేరుకుపోవడంతో పాటు అసిడిటీ సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే భోజనం చేయాలి. ఆకలిగా లేనప్పుడు కేవలం తేలికపాటి ఆహారాన్ని లేదా ద్రవ పదార్థాన్ని మాత్రమే తీసుకోవాలి. అదే విధంగా ప్రతి రోజూ నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి. ఈ భోజన నియమాలను పాటించడం వల్ల మన చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.