Pappu Chekodilu : పప్పు చేకోడీలు. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. పప్పు చేకోడీల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ పప్పు చేకోడీలు మనకు బయట ఎక్కువగా దొరుకుతుంటాయి. బయట కొనుగోలు చేసే పని లేకుండా వీటిని చాలా సులుభంగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పప్పు చేకోడీలను రుచిగా కరకరలాడుతూ ఉండేలా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పప్పు చేకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, బియ్యం పిండి – ఒక కప్పు, శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, వాము పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, గంట పాటు నానబెట్టిన శనగపప్పు – పావు కప్పు.
పప్పు చేకోడీలను తయారు చేసే విధానం..
ముందుగా ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బియ్యం పిండి, శనగపిండి వేసి చిన్న మంటపై కలుపుతూ 5 నుండి 10 నిమిషాల పాటు వేయించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పిండి పూర్తిగా చల్లగా అయ్యే వరకు కూడా కలుపుతూ ఉండాలి. తరువాత ఈ పిండిలో పసుపు, ఉప్పు, కారం, వాము పొడి వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత ఈ పిండిని చేతికి నూనె రాసుకుంటూ కావల్సిన పరిమాణంలో తీసుకుని గుండ్రంగా పగుళ్లు లేకుండా చేసుకోవాలి.
తరువాత ఈ పిండిని పొడుగ్గా స్థూపాకారంలో చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తరువాత దానిపై నానబెట్టిన శనగపప్పును వేసి శనగపప్పు లోపలికి వెళ్లేలా మెల్లగా వత్తుకోవాలి. తరువాత దీనిని చేకోడి ఆకారంలో చుట్టుకోవాలి. ఇలా చేకోడీలను చుట్టుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కొద్దిగా వేడయ్యాక చేకోడీలను వేసి కాల్చుకోవాలి. ఈ చేకోడీలను మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే పప్పు చేకోడీలు తయారవుతాయి. ఈ చేకోడీలను గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ చేకోడీలు ఎంతో చక్కగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.