Kandi Pachadi : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో కందిపప్పు ఒకటి. కందిపప్పులో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కందిపప్పుతో వివిధ రకాల పప్పు కూరలను తయారు చేస్తూ ఉంటాం. అంతేకాకుండా కందిపప్పుతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. కంది పప్పుతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. కందిపప్పుతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కంది పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – అర కప్పు, ఎండుమిర్చి – 6, జీలకర్ర – ఒక టీ స్పూన్, చింతపండు – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు – 5, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, ఇంగువ – పావు టీ స్పూన్.
కందిపచ్చడి తయారీ విధానం..
ముందుగా మందంగా ఉండే కళాయిని తీసుకుని అందులో కందిపప్పును వేసి వేయించాలి. ఈ కందిపప్పును చిన్న మంటపై 5 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత ఇందులో ఎండుమిర్చి, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మరో 5 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తరువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత అందులో పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మరలా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కంది పచ్చడిని మరీ పలుచగా కాకుండా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనె వేడాయ్యాక తాళింపు పదార్థాలను వేసి వేయించుకోవాలి. చివరగా ఇంగువను వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ తాళింపును ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కంది పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా కందిపప్పుతో ఇలా పచ్చడిని చేసుకుని తినవచ్చు.