Kalakand Recipe : పాలతో పెరుగు, నెయ్యి వంటివే కాకుండా మనం రకరకాల తీపి పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పాలతో చేసే తీపి వంటకాల్లో కలాకండ్ ఒకటి. మనకు బయట స్వీట్ షాపుల్లో ఎక్కువగా దొరుకుతుంది. ఈ కలాకండ్ ను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అచ్చం బయట లభించే విధంగా ఉండే ఈ కలాకండ్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చక్కటి రుచిని కలిగి ఉండే ఈ కలాకండ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కలాకండ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి పాలు – 2 లీటర్లు, పంచదార – 300 గ్రా., నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నిమ్మ ఉప్పు – చిటికెడు, యాలకుల పొడి – కొద్దిగా.
కలాకండ్ తయారీ విధానం..
ముందుగా ఒక ఇనుప కళాయిలో పాలను పోసి కలుపుతూ వేడి చేయాలి. పాలు మరిగి చిక్కబడిన తరువాత నిమ్మ ఉప్పును నీటిలో కరిగించి పాలల్లో వేసి కలుపుతూ ఉండాలి. నిమ్మ ఉప్పు వేసిన 10 నిమిషాలకు పాలు విరిగి పోతాయి. పాలు విరిగిన తరువాత కొద్ది కొద్దిగా పంచదారను వేసి కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తరువాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి వేసిన తరువాత పాల మిశ్రమం రంగు మారడాన్ని మనం గమనించవచ్చు. పాల మిశ్రమం దగ్గర పడి రండు మారిన తరువాత యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
దీనిని వెంటనే నెయ్యి రాసిన గిన్నెలోకి లేదా ట్రే లోకి తీసుకోవాలి. గంటెతో పై భాగాన్ని అంతా సమానంగా చేసుకోవాలి. తరువాత దీనిపై భాగాన్ని మూతతో లేదా అల్యూమినియం ఫాయిల్ తో మూసేసి 2 గంటల పాటు పక్కకు ఉంచాలి. తరువాత చాకుతో అంచులను గిన్నె నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనకు కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కలాకండ్ తయారవుతుంది. దీనిలో నిమ్మ ఉప్పుకు బదులుగా నిమ్మరసాన్ని కూడా ఉపయోగించవచ్చు. అప్పుడప్పుడూ ఇలా పాలతో కలాకండ్ ను తయారు చేసుకుని తినవచ్చు. పాలతో చేసిన ఈ తీపి వంటకాన్ని అందరూ ఇష్టంగా తింటారు.