Crispy Onion Pakoda Recipe : మనకు సాయంత్రం సమయాల్లో బయట ఎక్కువగా దొరికే చిరుతిళ్లల్లో పకోడీలు ఒకటి. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. స్నాక్స్ గా వీటిని చాలా మంది తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఈ పకోడీలను రుచిగా, కరకరలాడుతూ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గట్టి పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 300 గ్రా., తరిగిన పచ్చిమిర్చి – 4, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కచ్చాపచ్చాగా దంచిన ధనియాలు – ఒక టీ స్పూన్, శనగపిండి – 150 గ్రా., బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, కరివేపాకు – రెండు రెమ్మలు.
గట్టి పకోడి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను తీసుకోవాలి. తరువాత అందులో కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం పేస్ట్, జీలకర్ర, ధనియాలు వేసి ఉల్లిపాయలల్లోని నీరు బయటకు వచ్చేలా చేత్తో నలుపుతూ బాగా కలుపుకోవాలి. తరువాత శనగపిండి, బియ్యంపిండి, ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసి కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత ఉల్లిపాయ మిశ్రమాన్ని తీసుకుని మరీ పలుచగా కాకుండా కొద్దిగా ముద్దలుగా ఉండేలా పకోడీలుగా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే గట్టి పకోడి తయారవుతుంది. సాయంత్రం సమయాల్లో ఇలా కరకరలాడే గట్టి పకోడీని తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఇష్టంగా తింటారు.