Thunga Gaddi : రోడ్ల పక్కన, చెరువు గట్ల మీద, పొలాల గట్ల మీద పెరిగే వాటిల్లో తుంగ గడ్డి కూడా ఒకటి. దీనిని మనలో చాలా మంది చూసే ఉంటారు. దీనికి తుంగ ముస్తలు, బద్ర ముస్తలు, నాగర ముస్తలు అనే పేర్లు కూడా కలవు. తుంగ గడ్డిని సంస్కృతంలో ముస్తక అని, హిందీలో మోద అని ఇంగ్లీష్ లో నట్ గ్రాస్ అని పిలుస్తారు. వీటి దుంపలు గుండ్రంగా లావుగా, చిన్నగా, పొడుగ్గా, నల్లగా ఉంటాయి. ఈ తుంగ గడ్డి తడి గల మెట్ట ప్రదేశాలలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ గడ్డి రుచి వగరుగా, చేదుగా ఉంటుంది. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ తుంగ గడ్డిలో అలాగే తుంగ గడ్డలల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిని ఎంతో కాలంగా ఆయుర్వేదంలో అనారోగ్య సమస్యలు తగ్గించడానికి ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
తుంగ గడ్డలు చక్కటి వాసనను కలిగి ఉంటాయి. చాలా మంది ఈ గడ్డలను కొబ్బరి నూనెలో నానబెట్టి ఆ నూనెను తలకు రాసుకుంటారు. తుంగ గడ్డికి చలువ చేసే గుణం ఉంటుంది. కఫాన్ని, పైత్యాన్ని పోగొట్టడంలో కూడా తుంగ గడ్డి మనకు ఉపయోగపడుతుంది. తుంగ గడ్డలను, ఉసిరిక బెరడును, తానిక్కాయ బెరడును, ధనియాలను, ఆవు నెయ్యిని, చెరుకు రసాన్ని, వర్షపు నీటిని సమభాగాల్లో తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ 20 గ్రాముల మోతాదులో పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న రోగాలు హరించుకుపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తుంగ గడ్డలను, దాల్చిన చెక్కను, కబాబు చిన్ని ని సమభాగాల్లో తీసుకుని విడివిడిగా పొడి చేసి అన్నీ కలిపి నిల్వ చేసుకోవాలి.
ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఈ కషాయాన్ని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా చేయడం వల్ల బొల్లి వంటి చర్మ సమస్యలతో పాటు ఇతర చర్మ సమస్యలు కూడా మాయమవుతాయి. తుంగ గడ్డల పొడిని పూటకు 1 గ్రాము నుండి 3 గ్రాముల మోతాదులో రెండు పూటలా నీటితో కలిపి తీసుకోవడం వల్ల రక్తవిరోచనాలు, మొలలు వంటి సమస్యలు తగ్గుతాయి. తుంగ గడ్డలను, నాగ కేసరాలను, వట్టి వేర్లను, కరక్కాయలను, చంగల్వ కొష్టును సమ భాగాల్లో తీసుకుని నీటితో కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
తుంగగడ్డలను,నేల వేమును, దేవదారు చెక్కను, వస కొమ్ములను, తిప్ప తీగ, కటిక రోహిణి, శొంఠిని సమభాగాల్లో తీసుకుని విడివిడిగా పొడి చేసి అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని వయసును బట్టి పావు టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ మోతదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరిగించాలి. ఈ కషాయాన్ని వడకట్టి రోజుకు రెండు లేదా మూడు పూటలూ తీసుకోవడం వల్ల టైఫాయిడ్ జ్వరం తగ్గుతుంది. ఇవే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా తుంగగడ్డి మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.