Wheat Flour Cake Recipe : మనకు బేకరీలలో లభించే పదార్థాల్లో కేక్ ఒకటి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కేక్ ను అందరూ ఇష్టంగా తింటారు. అలాగే ప్రతి శుభకార్యానికి కూడా కేక్ ను కట్ చేయడం ప్రస్తుత రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఈ కేక్ ను మనం ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాం. అయితే ఈ కేక్ ను తయారు చేయడానికి మనం మైదా పిండిని ఉపయోగిస్తూ ఉంటాం. మైదా పిండితో చేసిన కేక్ ను తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ కేక్ ను మనం రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా గోధుమపిండితో కూడా తయారు చేసుకోవచ్చు. గోధుమపిండితో రుచిగా, ఫ్లఫీగా కేక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి కేక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – 2 కప్పులు, బేకింగ్ పౌడర్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా – అర టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, పంచదార పొడి – 2 కప్పులు లేదా తగినంత, కాచి చల్లార్చిన నెయ్యి – ఒక కప్పు, కాచిచల్లార్చిన పాలు – అర కప్పు, కోడిగుడ్లు – 3, వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్.
గోధుమపిండి కేక్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జల్లెడను ఉంచాలి. తరువాత ఈ జల్లెడలో గోధుమపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి. తరువాత పంచదార పొడిని వేసి జల్లించుకోవాలి. తరువాత నెయ్యిని, పాలను పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కేక్ మిశ్రమం మరీ గట్టిగా ఉంటే మరికొన్ని పాలను పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కోడిగుడ్లను వేసి బ్లెండర్ తో ప్లఫీగా అయ్యే వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి. కోడిగుడ్లు ఫ్లఫీగా అయిన తరువాత దానిలో వెనీలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని గోధుమపిండి మిశ్రమంలో వేసి ఒకే దిశలో అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత ఒక అల్యూమినియం గిన్నెను తీసుకుని దానికి నెయ్యి లేదా నూనె రాయాలి. తరువాత ఈ గిన్నెలో అడుగు భాగాన్న బటర్ పేపర్ ను వేయాలి. తరువాత తయారు చేసుకున్న కేక్ మిశ్రమాన్ని వేసి మధ్యలో గాలి బుడగలు లేకుండా గిన్నెను పట్టుకుని కదపాలి.
తరువాత కుక్కర్ లో ఒక స్టాండ్ ను ఉంచాలి. ఈ స్టాండ్ పైన కేక్ గిన్నెను ఉంచి మూత పెట్టాలి. కుక్కర్ విజిల్ తీసేసి ఈ కేక్ ను మధ్యస్థ మంట కంటే కొద్దిగా తక్కువ మంటపై 30 నుండి 45 నిమిషాల వరకు ఉడికించాలి. 30 నిమిషాల తరువాత కుక్కర్ మూత తీసి కేక్ లోకి ఒక టూత్ పిక్ ను గుచ్చి చూడాలి. టూత్ పిక్ కు పిండి అట్టుకోకుండా ఉంటే కేక్ తయారయ్యిందిగా భావించాలి. ఒకవేళ టూత్ పిక్ కు పిండి అంటుకుంటే మరికొద్ది సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కేక్ గిన్నెను కుక్కర్ నుండి బయటకు తీసి కేక్ ను గిన్నె నుండి వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా మెత్తగా ఉండే గోధుమపిండి కేక్ తయారవుతుంది. బ్లెండర్ లేని వారు మిక్సీ జార్ లో వేసి కూడా కోడిగుడ్లను బ్లండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన కేక్ ను తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది. ఈ కేక్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.