Aloo Ka Salan Recipe : మనం వంటింట్లో అప్పుడప్పుడూ బిర్యానీ, పులావ్ వంటి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పిల్లలతో పాటు పెద్దలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. ఈ వంటకాలతో పాటు వీటిని తినడానికి కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇలా తయారు చేసే కూరల్లో ఆలూ క సాలన్ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పులావ్, బిర్యానీ వంటి వంటకాల రుచిని మరింత పెంచే ఆలూ క సాలన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాదీ స్టైల్ ఆలూ కా సాలన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించి తరిగిన బంగాళాదుంపలు – పావు కిలో, పెద్దగా తరిగిన టమాటాలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 4, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – 4 టేబుల్ స్పూన్స్, నానబెట్టిన చింతపండు – 5 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 3, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కరవేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
హైదరాబాదీ స్టైల్ ఆలూ కా సాలన్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలను వేసి దోరగా వేయించాలి. తరువాత నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి పొడి వేసి మధ్యస్థ మంటపై వేయించాలి. ఇవి చల్లారిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి పొడిగా చేసుకోవాలి. తరువాత పావు గ్లాస్ నీళ్లు పోసి పేస్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పసుపు, ఉడికించిన బంగాళాదుంపలు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర వేగిన తరువాత అల్లం పేస్ట్, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ను వేసుకోవాలి.
ఇందులోనే ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత ఇందులో పచ్చిమిర్చి, టమాట ముక్కలు, చింతపండు రసం, ఒక గ్లాస్ నీటిని పోసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వేయించి పెట్టుకున్న బంగాళాదుంపలను, కసూరి మెంతిని, కొత్తిమీరను వేసి మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ క సాలన్ కర్రీ తయారవుతుంది. ఈ కర్రీని పులావ్, బిర్యానీ, చపాతీ వంట కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.