Palakura Idli Recipe : ఉదయం సాధారణంగా చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఇడ్లీలను తింటుంటారు. మినప పప్పుతో చేసే ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. అయితే కేవలం ఇవే కాదు.. రకరకాల ఇడ్లీలను మనం తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగానే పాలకూరతోనూ మనం ఇడ్లీలను చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. తయారు చేయడం కూడా సులభమే. ఇందుకు పిండిని పులియబెట్టాల్సిన పనిలేదు. అప్పటికప్పుడు కూడా వీటిని చేసుకోవచ్చు. ఇక పాలకూరతో ఇడ్లీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకూర ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన పెసర పప్పు – అర కప్పు, పాలకూర తరుగు – ముప్పావు కప్పు, తరిగిన పచ్చి మిర్చి – 1 టేబుల్ స్పూన్, పెరుగు – 1 టేబుల్ స్పూన్, నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా.
పాలకూర ఇడ్లీని తయారు చేసే విధానం..
ముందుగా మిక్సీలో పెసర పప్పు, పాలకూర, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని బౌల్‌లోకి తీసుకుని అందులో పెరుగు, ఉప్పు వేసి కలపాలి. అలాగే నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు నూనె రాసి మిశ్రమాన్ని పెట్టుకోవాలి. తరువాత ఆవిరిలో ఈ పాత్రలను పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత వాటిని వేడి వేడిగా ఉన్నప్పుడు ఏదైనా చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేయాలి. దీంతో ఎంతో రుచికరమైన పాలకూర ఇడ్లీలు రెడీ అవుతాయి. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు.. ఆరోగ్యకరం కూడా.