Castor Oil Tree : ఆముదం చెట్టు.. ఇది మనందరికి తెలిసిందే. గ్రామాల్లో ఈ చెట్టు మనకు విరివిరిగా కనబడుతుంది. ఈ చెట్టు గింజల నుండి తీసిన నూనెనే మనం ఆముదం నూనెగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. పూర్వకాలంలో ఈ ఆముదం నూనెను ఎక్కువగా ఉపయోగించే వారు. మన శరీరంలో ఉండే ప్రతి అవయవానికి వచ్చే అనారోగ్య సమస్యలను ఈ నూనెను వాడడం వల్ల తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆముదాన్ని సంస్కృతంలో ఏరండ, పంచాంగుల, వర్దమాన అని పిలుస్తారు. ఈ ఆముదంలో కూడా తెల్ల ఆముదం, ఎర్ర ఆముదం అని రెండు రకాలు ఉంటాయి. ఆముదం చెట్టు అలాగే నూనెలో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే దీనిని వాడడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పక్షవాతం, మలబద్దకం వంటి అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఆముదం గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. 100 గ్రాముల ఆముదం గింజలను తీసుకుని వేయించి పొడిగా చేయాలి. ఇప్పుడు ఒక కళాయిలో ఈ పొడిని తీసుకోవాలి. తరువాత ఈ పొడికి నాలుగు రెట్ల ఆవు పాలను పోసి కోవా లాగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ఇందులో 100 గ్రా.ల పంచదార వేసి లేహ్యం లాగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ లేహ్యాన్ని ప్రతిరోజూ రెండు పూటలా ఆహారానికి గంట ముందు 5 నుండి 10 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పక్షవాతం, మలబద్దకంతో పాటు అన్ని రకాల వాత రోగాలు తగ్గిపోతాయి. అయితే ఈ లేహాన్ని వాడినంత కాలం వాతాన్ని, కఫాన్ని కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. రుతు సంబంధిత సమస్యలతో బాధపడే స్త్రీలకు కూడా ఆముదం ఎంతగానో సహాయపడుతుంది.

ఆముదం ఆకును నలిపి వేడి చేయాలి. ఇలా వేడి చేసిన ఆకును రాత్రి పడుకునే ముందు పొత్తి కడుపు మీద ఉంచి కట్టు కట్టాలి. ఉదయాన్నే ఈ ఆకును తొలగించాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల స్త్రీలల్లో వచ్చే రుతు సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. కీళ్ల నొప్పులు, వాపులు, నొప్పులు, మంటలు వంటి సమస్యలను కూడా ఆముదాన్ని ఉపయోగించి తగ్గించుకోవచ్చు. ఆముదం ఆకులకు నువ్వుల నూనె రాసి వేడి చేయాలి. తరువాత ఈ ఆకులను కీళ్ల నొప్పులు, వాపులు ఉన్న చోట ఉంచి కట్టు కట్టాలి. అలాగే ఆముదం గింజలను మెత్తగా నూరి ముద్దగా చేయాలి.
ఈ ముద్దను వేడి చేసి కీళ్ల నొప్పులపై ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు, కీళ్ల మంటలు వంటి సమస్యలు తగ్గుతాయి. ఆముదం గింజలను పెరుగులో నానబెట్టి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని దురదలు, దద్దుర్లు వంటి సమస్యలు ఉన్న చోట చర్మం పై రాయాలి. ఇలా చేయడం వల్ల దురదలు, దద్దర్లతో పాటు ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. వంటల్లో ఉపయోగించే ఆముదం నూనెను క్రమం తప్పకుండా రెండు నెలల పాటు తలకు రాయడం వల్ల రేచీకటి సమస్య తగ్గుతుంది. ఈ ఆముదం నూనెలో తాళింపు వేసిన చామ దుంపల కూరను తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
అలాగే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కొద్ది మోతాదులో ఆముదం నూనెను తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. బట్టతల, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడే వారు ఆముదం గింజల్లో ఉండే పప్పును మెత్తగా నూరి తలపై రుద్దుతూ ఉండడం వల్ల బట్టతలపై కూడా వెంట్రుకలు మొలస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆముదం నూనెలో మెంతుల పొడిని కలిపి జుట్టుకు ప్యాక్ లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేస్తూ ఉంటే వెంట్రుకలు ధృడంగా, బలంగా తయారవుతాయి. ఈవిధంగా ఆముదం చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.