Spicy Chicken Masala : చికెన్ అంటే చాలా మందికి ఇష్టమే. దీన్ని వివిధ రకాలుగా వండుకుని తింటుంటారు. కూర, వేపుడు, బిర్యానీ చేస్తుంటారు. అయితే నాన్‌వెజ్ వంటలలో కారం, మసాలాలు ఎక్కువగా ఉండాల్సిందే. లేదంటే చప్పగా చేస్తే రుచించవు. అసలు నచ్చవు. కనుక కారం, మసాలాలను దట్టించి నాన్‌వెజ్ వంటలను వండాలి. ఈ క్రమంలోనే చికెన్‌ను కూడా అలాగే వండవచ్చు. బాగా కారం ఉండే విధంగా ఘాటుగా చికెన్‌ను చేసుకోవచ్చు. చికెన్‌ను స్పైసీగా మసాలాలతో కారంగా ఉండేలా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్పైసీ చికెన్ మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ ముక్కలు – పావు కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు, పెరుగు – 2 టేబుల్ స్పూన్లు, కాశ్మీరీ కారం – 2 టీస్పూన్లు, పసుపు – అర టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, జీలకర్ర పొడి – అర టీస్పూన్, గరం మసాలా – అర టీస్పూన్, లవంగాలు – 6, కాశ్మీరీ మిర్చి – 7, నూనె – 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము – కొద్దిగా, ఉప్పు – రుచికి సరిపడా.
స్పైసీ చికెన్ మసాలాను తయారు చేసే విధానం..
చికెన్ ముక్కలకు కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, ఉప్పు అన్నీ పట్టించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు కూడా పట్టించి ఫ్రిజ్‌లో సుమారు అర గంటసేపు ఉంచాలి. మిక్సీలో కశ్మీరీ ఎండు మిర్చి, లవంగాలు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. బాణలిలో నూనె వేసి కాగాక అన్నీ పట్టించిన చికెన్ ముక్కలను వేసి 10 నిమిషాల పాటు వేయించాలి. తరువాత మూత పెట్టి ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి. ఇప్పుడు రుబ్బిన కారం ముద్ద కూడా వేసి సిమ్‌లో దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తరువాత దింపేయాలి. దీంతో ఎంతో రుచికరమైన స్పైసీ చికెన్ మసాలా రెడీ అవుతుంది. దీన్ని అన్నం, చపాతీలు, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. రెగ్యులర్ గా చేసే చికెన్ వంటకాలకు బదులుగా ఓసారి ఇలా చికెన్ ను కారంగా, ఘాటుగా వండుకుని తిని చూడండి. ఎంతో ఇష్టపడతారు. మళ్లీ మళ్లీ కావాలంటారు.