చాలా మందికి సాధారణంగా అప్పుడప్పుడు వికారంగా అనిపిస్తుంటుంది. ఆహారం తిన్నా, ద్రవాలు తీసుకున్నా వాంతులు అయినట్లు భావన కలుగుతుంది. కొందరికి వాంతులు అవుతాయి కూడా. అయితే ఈ సమస్యకు అనేక కారణాలు ఉంటాయి. కానీ కింద తెలిపిన ఈ చిట్కాలను పాటిస్తే వికారం, వాంతుల సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…
1. అల్లంలో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. వాటిని జింజరాల్స్, షొగౌల్స్ అంటారు. ఇవి యాంటీ ఎమెటిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల వికారం సమస్య నుంచి బయట పడవచ్చు. అల్లం రసం తీసుకోవడం వల్ల వికారం తగ్గుతుంది. వాంతులు అవకుండా ఉంటాయి. రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు టీస్పూన్ల అల్లం రసం సేవించాలి. రాత్రి భోజనానికి ముందు కూడా తీసుకోవచ్చు. దీంతో వికారం నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. పుదీనా ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల కూడా వికారం తగ్గుతుంది. పుదీనాలో యాంటీ స్పాస్మోడిక్ గుణాలు ఉంటాయి. ఇవి కడుపు నొప్పి, వికారం, వాంతులు సమస్యలను తగ్గిస్తాయి. పెప్పర్మింట్ ఆయిల్లో బాగా ముంచిన ఓ కర్చీఫ్‌ను ఎప్పటికప్పుడు వాసన పీలుస్తుండాలి. లేదా పెప్పర్మింట్ ఆయిల్‌ను మరుగుతున్న నీటిలో కొన్ని చుక్కలు వేసి బాగా ఆవిరిపట్టాలి. లేదా పుదీనా ఆకుల రసాన్ని మూడు పూటలా భోజనం అనంతరం కొద్దిగా సేవించాలి. దీని వల్ల వికారం తగ్గుతుంది.
3. విటమిన్ బి6 ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా వికారం సమస్య నుంచి బయట పడవచ్చు. 2019లో కొందరు సైంటిస్టులు ఈ విషయంపై అధ్యయనం కూడా చేపట్టారు. 60 రోజుల పాటు కొందరికి విటమిన్ బి6 ఉన్న ఆహారాలను ఇచ్చారు. చివరకు పరిశీలించగా వారిలో వికారం సమస్య తగ్గినట్లు గుర్తించారు. విటమిన్ బి6 మనకు చేపలు, చికెన్, టర్కీ, కోడిగుడ్లు, సోయా బీన్, తృణ ధాన్యాలు, కూరగాయాల్లో లభిస్తుంది. విటమిన్ బి6 ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల గర్భంతో ఉన్న మహిళల్లోనూ వికారం సమస్య తగ్గుతుంది.
4. నిమ్మకాయలు కూడా వికారాన్ని తగ్గిస్తాయి. నిమ్మకాయలను ఎప్పుడూ వాసన చూస్తుంటే వికారం తగ్గుతుంది. లేదా లెమన్ ఎసెన్షియల్ ఆయిల్, నిమ్మరసం కూడా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ నీటిలో నిమ్మరసం, తేనెలను కొద్ది కొద్దిగా కలుపుకుని తాగాలి. రోజూ ఉదయం, సాయంత్రం ఇలా చేస్తే వికారం, వాంతులు తగ్గుతాయి.
5. కమోమిల్ టీని తాగడం వల్ల జీర్ణాశయంలో అసిడిటీ తగ్గుతుంది. ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. దీంతోపాటు వికారం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365