Street Style Masala Vada : మనకు సాయంత్రం సమయాల్లో బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో మసాలా వడలు కూడా ఒకటి. శనగపప్పును ఉపయోగించి తయారు చేసే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని బయట కొనుగోలు చేసి తింటూ ఉంటారు. బయట బండ్ల మీద లభించే మసాలా వడలను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. మసలా వడలను స్ట్రీట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రీట్ స్టైల్ మసాలా వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – పావు కిలో, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన తోటకూర – అర కప్పు, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
స్ట్రీట్ స్టైల్ మసాలా వడ తయారీ విధానం..
ముందుగా శనగపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 3 నుండి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును తీసి పక్కకు పెట్టుకుని మిగిలిన శనగపప్పును జార్ లో వేసి మిక్సీ పట్టుకోవాలి. దీనిని మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ శనగపప్పు మిశ్రమంలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకోవాలి. తరువాత పక్కకు పెట్టుకున్న శనగపప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగిన పరిమాణంలో పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక పిండి ఉండలను తీసుకుని వడలాగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత గంటెతో అటూ ఇటూ కదుపుకుంటూ వేయించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా వడలు తయారవుతాయి. వీటిని పల్లి చట్నీ, టమాట చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయంలో అప్పుడప్పుడు ఇలా మసాలా వడలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.