Rasam : మనం అప్పుడప్పుడు రసాన్నికూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. రసం చాలా రుచిగా ఉంటుంది. కొందరు ప్రతిరోజూ భోజనం చేస్తూ ఉంటారు కూడా. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రసంతో భోజనం చేస్తే నోటికి కమ్మగా ఉంటుంది. ఈ రసాన్ని రుచిగా, సులువుగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఎండుమిర్చి – 2, చిన్న ఉల్లిపాయలు – పావు కప్పు, నానబెట్టిన చింతపండు – 10 గ్రా., నీళ్లు – రెండున్నర గ్లాసులు, ఉప్పు – తగినంత, బెల్లం – ఒక చిన్నముక్క, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రసం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒకటీ స్పూన్, కందిపప్పు – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – అర టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, మెంతి గింజలు – 10, ఎండుమిర్చి – 4, కరివేపాకు – రెండు రెమ్మలు, అల్లం ముక్క – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 5.
రసం తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి దోరగా వేయించాలి. తరువాత ఎండుమిర్చి కూడా వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయలు వేసి వేయించాలి. తరువాత చింతపండు రసం, నీళ్లు, ఉప్పు, బెల్లం, మిక్సీ పట్టుకున్న రసం పొడి వేసి కలపాలి. తరువాత ఈ రసాన్ని 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై బాగా మరిగించాలి.
చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రసం తయారవుతుంది. ఈ రసాన్ని వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా రసాన్ని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.