Kodiguddu Ponganalu : కోడిగుడ్డుతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్డుతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. కోడిగుడ్డుతో కూర, ఫ్రై వంటి వాటినే కాకుండా చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్డుతో మనం పొంగనాలను కూడా తయారు చేసుకోవచ్చు. కోడిగుడ్డు పొంగనాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. కోడుగుడ్లతో రుచిగ పొంగనాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ పొంగనాల తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, నూనె – కొద్దిగా, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, నిమ్మకాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

ఎగ్ పొంగనాలు తయారీ విధానం..
ముందుగా గిన్నెలో కోడిగుడ్లను వేసుకుని బాగా కలపాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. అలాగే నిమ్మరసాన్ని కూడా పిండుకుని బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల పెన్నాన్ని ఉంచి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని పొంగనాల లాగా వేసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి చిన్న మంటపై 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మూత తీసి మరో వైపుకు తిప్పుకోవాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ పొంగనాలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకు ఇలా ఎగ్ పొంగనాలను తయారు చేసి ఇవ్వడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించవచ్చు.