Kaju Mushroom Masala Curry : మన శరీరానికి అవసరమయ్యే పోషకాలను అలాగే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే ఆహారాల్లో పుట్ట గొడుగులు ఒకటి. ఇవి మననందరికి తెలిసినవే. శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలను అందించడంలో పుట్టగొడుగులు మకు ఎంతో దోహదపడతాయి. వీటితో రకరకాల రుచికరమైన వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా దాబా స్టైల్ లో కాజు మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దాబా స్టైల్ కాజు మష్రూమ్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పుట్ట గొడుగులు – పావు కిలో, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన టమాటాలు – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి ముక్కలు – 3 టేబుల్ స్పూన్స్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 4, యాలకులు – 2, జాపత్రి – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, బిర్యానీ ఆకు – 1, కరివేపాకు – ఒక రెమ్మ, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – రెండు టేబుల్ స్పూన్స్.
దాబా స్టైల్ కాజ్ మష్రూమ్ కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పుట్టగొడుగు ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో జీడిపప్పును వేసి వేయించాలి. దీనిని కూడా ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం పేస్ట్, టమాట ముక్కలు వేసి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తగా అయిన తరువాత దానిలో మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసి కలపాలి.
తరువాత దీనిని నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి. తరువాత వేయించిన పుట్ట గొడుగు ముక్కలు, జీడిపప్పు, ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కసూరి మెంతి, కరివేపాకు, కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దాబా స్టైల్ కాజు మష్రూమ్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటి, నాన్. పులావ్, బిర్యానీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. పుట్టగొడుగులతో ఈ విధంగా కూరను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు పుట్ట గొడుగును తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చు.