Chicken Dum Curry : చికెన్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. తగినన్ని ప్రోటీన్లను అందించి శరీరాన్ని బలంగా, ధృడంగా చేయడంలో చికెన్ మనకు దోహదపడుతుంది. చికెన్ తో ఎక్కువగా కర్రీని తయారు చేస్తూ ఉంటాం. చికెన్ కర్రీని చాలా మంది ఇష్టంగా తింటారు. తరచూ చేసే చికెన్ కర్రీ కంటే కొద్దిగా భిన్నంగా, మరింత రుచిగా చికెన్ ను దమ్ చేసి కూడా మనం కూరను తయారు చేసుకోవచ్చు. చికెన్ కర్రీని అందరూ ఇష్టపడేలా మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి పొడి – 2 టీ స్పూన్స్, ఫ్రైడ్ అనియన్స్ – ముప్పావు కప్పు, తరిగిన కొత్తిమార – కొద్దిగా.
చికెన్ దమ్ చేయడానికి కావల్సిన పదార్థాలు..
చికెన్ – కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, పసుపు – ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, గరం మసాలా – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి -3, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, నూనె – 5 టీ స్పూన్స్, పెరుగు – అర కప్పు, నిమ్మరసం – రెండు టీ స్పూన్లు.
చికెన్ కర్రీ తయారీ విధానం..
ముందుగా చికెన్ ను ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి అడుగు మందంగా, లోతుగా గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో చికెన్ దమ్ చేయడానికి కావల్సిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి దమ్ చేసుకోవాలి. తరువాత చికెన్ ను బయటకు తీసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత నానబెట్టిన జీడిపప్పును పేస్ట్ గా చేసి చికెన్ లో వేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి పొడి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత చికెన్ గిన్నెను స్టవ్ మీద ఉంచి 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి.
తరువాత ఒక చిన్న గ్లాస్ లేదా తగినన్ని నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మంటను చిన్నగా చేసి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ను పూర్తిగా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికి నూనె పైకి తేలిన తరువాత కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే చికెన్ కర్రీ కంటే ఈ విధంగా చేసిన చికెన్ కర్రీ మరింత రుచిగా ఉంటుంది. దీనిని ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా అందరూ ఇష్టంగా తింటారు.