Ravva Laddu : బొంబాయి రవ్వతో మనం రకరకాల వంటకాలను తయారు చేసి ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బొంబాయి రవ్వను ఉపయోగించి చేసే ఈ వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. బొంబాయి రవ్వతో వంటకాలు చేయడం కూడా చాలా సులభం. ఈ రవ్వతో చేసుకోదగిన తీపి వంటకాల్లో రవ్వ లడ్డూలు ఒకటి. ఇవి మనందరికి తెలిసినవే. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ రవ్వ లడ్డూలను సులభంగా, చక్కగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక గ్లాస్, నెయ్యి – 5 టీ స్పూన్స్, డ్రైఫ్రూట్స్ – తగినన్ని, పచ్చి కొబ్బరి తురుము – అర గ్లాస్, దంచిన యాలకులు – 5, పంచదార – ఒక గ్లాస్, గోరు వెచ్చని పాలు – అర కప్పు.
రవ్వ లడ్డూ తయరీ విధానం..
ముందుగా ఒక కళాయిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే నెయ్యిలో పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత దీనిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక రవ్వను వేసి కలుపుతూ దోరగా వేయించాలి. రవ్వ వేగిన తరువాత ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి వేసి కలపాలి. తరువాత యాలకులు, పంచదార వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలను పోస్తూ తగిన పరిమాణంలో రవ్వ మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ లడ్డూలు తయారవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు లేదా ప్రత్యేక సందర్భాల్లో ఇలా రుచిగా, సులువుగా అయ్యే ఈ రవ్వ లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ లడ్డూలను అందరూ ఇష్టంగా తింటారు. రవ్వతో అప్పుడప్పుడూ ఇలా రుచిగా, మెత్తగా ఉండే లడ్డూలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.