Masala Macaroni : పాస్తా.. దీనిని ఇష్టంగా తినే వారు మనలో చాలా మందే ఉన్నారు. దీనిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. పాస్తా చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ పాస్తాను దేశీ స్లైల్ లో మసాలా వేసి కూడా చేసుకోవచ్చు. మసాలా వేసి చేసే ఈ పాస్తా కూడా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. పాస్తాను మసాలా వేసి దేశీ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా మాక్రోని తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎల్ బో పాస్తా – ఒక కప్పు, నీళ్లు – తగినన్ని, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పెద్ద టమాట – 1, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, కారం – ముప్పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, క్యాప్సికం తరుగు – పావు కప్పు, పచ్చి బఠాణీ – పావు కప్పు, నిమ్మరసం – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా మాక్రోని తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత పాస్తా ను వేసి మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత నీటిని వడకట్టి పాస్తాను ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత పచ్చిబఠాణీ వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. టమాట ముక్కలు సగం వేగిన తరువాత క్యాప్సికం ముక్కలు వేసి మరో నిమిషం పాటు వేయించాలి.
తరువాత అర కప్పు నీళ్లు పోసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత ఉడికించిన పాస్తాను వేసి కలపాలి. దీనిని నీరు అంతా పోయి పాస్తా అంతా దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత నిమ్మరసం, కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా పాస్తా తయారవుతుంది. దీనిని అల్పాహారంగా లేదా స్నాక్స్ గా అయినా తినవచ్చు. దీనిలో కార్న్, మష్రూమ్, పన్నీర్ వంటి ఇతర పదార్థాలను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పాస్తాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.